సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన రావెల కిశోర్ బాబు

  • వైసీపీ కండువా కప్పుకున్న మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు
  • పార్టీ కోసం జగన్ ఏం చెబితే అది చేస్తానని వెల్లడి
  • ఎప్పటికీ విధేయుడిగా ఉంటానని వ్యాఖ్యలు
ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు నేడు వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రావెల్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రావెలకు వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ, పార్టీ కోసం జగన్ ఏం చెబితే అది చేస్తానని అన్నారు. ఎప్పటికీ ఒక విధేయుడిగా ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చుతున్నది సీఎం జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. పేదల ఖాతాల్లో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు జమ చేసి చరిత్ర సృష్టించడం జగన్ కే సాధ్యమైందని కొనియాడారు. జగన్ నిస్వార్థంగా పేదలకు చేస్తున్న సేవలను చూసే వైసీపీలో చేరానని రావెల పేర్కొన్నారు. 

కాగా, ఈ కార్యక్రమంలో రావెల కుటుంబ సభ్యులు, ఎంపీ నందిగం సురేశ్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేసిన రావెల్ కిశోర్ బాబు తొలుత టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ఎస్సీ రిజర్వ్ డ్ స్థానం ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2018లో జనసేనలో చేరిన రావెల... ఆ మరుసటి ఏడాదే రాజీనామా చేశారు.


More Telugu News