ఇది మా భరత భూమి: చైనా సైనికులను నిలువరించిన లడఖ్ గొర్రెల కాపరులు.. వీడియో వైరల్

  • సోషల్ మీడియాలో భారతీయుల హృదయాలను గెలుచుకున్న గొర్రెల కాపరుల వీడియో
  • వాస్తవాధీన రేఖ వద్ద గొర్రెలు మేపుతున్న కాపరులు
  • ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చైనా సైనికుల ఆదేశాలు
  • ఇది మా ప్రాంతం... మా భూభాగంలో మేం మేపుకుంటున్నామని దీటుగా సమాధానమిచ్చిన కాపరులు
  • గొర్రెల కాపరులకు మద్దతుగా నిలిచిన భారత ఆర్మీ
వాస్తవ నియంత్రణ రేఖ వద్ద చైనా సైనికులను లడఖ్ గొర్రెల కాపరులు నిలువరించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇక్కడ గొర్రెలను మేపవద్దని చైనా సైనికులు గట్టిగా చెప్పినా... ఇది భారత భూభాగమని, మా భూభాగంలో మేం మేపుకుంటున్నామని చైనా సైనికులకు గట్టిగా చెప్పారు. 2020 గాల్వాన్ ఘర్షణ తర్వాత స్థానిక కాపరులు ఈ ప్రాంతంలో గొర్రెలను మేపడం మానేశారు. కానీ ప్రస్తుతం చైనా సైనికులతో గొర్రెల కాపరులు ఇది తమ భూభాగమంటూ వాదించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో భారతీయుల హృదయాలను గెలుచుకుంది.

గత మూడేళ్లుగా తూర్పు లడఖ్‌లోని సంచార జాతులు వాస్తవాధీన రేఖ సమీపంలో పలు ప్రాంతాల్లో జంతువులను మేపడం మానేశారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో తమ హక్కులను నొక్కి చెప్పడం... PLA సైనికులను వెనక్కి వెళ్ళేలా చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. LAC అనేది భారత, చైనా భూభాగాలను వేరుచేసే ఒక సరిహద్దు రేఖ.

చుషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ స్థానిక గొర్రెల కాపరులు చూపిన ప్రతిఘటనను ప్రశంసించారు. గొర్రెల కాపరులకు మద్దతుగా నిలిచిన భారత సైన్యాన్ని కొనియాడారు. తూర్పు లడఖ్‌లోని సరిహద్దు ప్రాంతాలలో ఇండియన్ ఆర్మీ సహకారం ద్వారా గొర్రెల కాపరులు తమ హక్కులను నొక్కి చెప్పారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి బలమైన పౌర, సైనిక సంబంధాలు ఉండాలని... సరిహద్దు ప్రాంత ప్రజల ప్రయోజనాలను రక్షించినందుకు ఇండియన్ ఆర్మీకి ధన్యవాదాలు తెలిపారు.

"మేము మేపుతున్న ప్రాంతం మా సంచార జీవుల మేత భూమి అని స్థానికులు PLA ముందు తమ ధైర్యసాహసాలను ఎలా ప్రదర్శిస్తున్నారో చూడండి. చైనా ఆర్మీ.... మన భూభాగంలో మన సంచార జాతులను మేపకుండా ఆపుతోంది. కానీ మన గొర్రెల కాపరులు అడ్డుకున్నారు. అలాగే మన భూమిని ఎల్లప్పుడూ రక్షించడానికి... దేశానికి రెండవ సంరక్షక శక్తిగా నిలిచే మన సంచార జాతులకు నేను నమస్కరిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

ఈ వీడియోలో మూడు చైనీస్ సాయుధ వాహనాలు, పలువురు సైనికులు అక్కడ నిలబడి ఉన్నారు. వాహనాలు అలారం మోగిస్తూ... గొర్రెల కాపరులను వెళ్లిపోవాలని సూచించారు. కానీ వారు తమ మైదానంలో నిలబడి PLA దళాలతో వాదనకు దిగారు. గొర్రెల కాపరులు తాము భారత భూభాగంలో పనిచేసుకుంటున్నామని పట్టుబట్టారు. ఒకట్రెండు సందర్భాలలో, వాగ్వాదం ముదిరినప్పుడు, కొందరు గొర్రెల కాపరులు రాళ్లు తీయడం వీడియోలో కనిపిస్తోంది. కానీ వీడియోలో ఎలాంటి హింస చెలరేగినట్లు కనిపించలేదు. వీడియోలో కనిపిస్తున్న చైనా సైనికులు ఆయుధాలు ధరించలేదు.

కాగా, భారత బలగాల మద్దతుతో గొర్రెల కాపరులు... చైనా దళాలను ధైర్యంగా ఎదుర్కొన్నట్లు చుషుల్ కౌన్సిలర్ తెలిపారు. చైనా సైనికులతో గొర్రెల కాపరుల సమస్యలను పరిష్కరించడంలో మన బలగాలు ఎప్పుడూ పౌరులకు అండగా ఉంటాయని... ఇందులో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితి సాధారణంగానే ఉందని... కానీ ఇది సున్నితమైన అంశమని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు.


More Telugu News