ఉత్తరప్రదేశ్‌లో కారవాన్ టూరిజం ప్రారంభం

  • మోటోహోం సంస్థతో కలిసి ప్రారంభించిన ప్రభుత్వం
  • ప్యాకేజీలో భాగంగా కుటుంబాలకు అనువైన కారవాన్ వాహనాలు సిద్ధం
  • కారవాన్‌లో ఆరు నుంచి 8 మంది ప్రయాణించే అవకాశం
  • వాహనంలో వాష్‌రూంలు, వంట చేసుకునేందుకు, నిద్రించేందుకు వసతులు
కుటుంబాలతో కలిసి పర్యటించే వారికి ఓ కొత్త తరహా అనుభవాన్నిచ్చే కారవాన్ టూరిజంను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రారంభించింది. మోటోహోం (Motohom) సంస్థతో కలిసి దీన్ని లాంచ్ చేసింది. ఈ టూరిజంలో పర్యాటకులు తమకు నచ్చిన కారవాన్ వాహనాన్ని ఎంచుకుని రాష్ట్రంలోని పలు ప్రాంతాలు చుట్టిరావచ్చు. పర్యాటకులు తమ కుటుంబాలతో ప్రయాణించేందుకు వీలుగా ఈ వాహనాల్లో అన్ని సదుపాయాలు కల్పించారు. రెండు వాష్‌రూంలు, వంట చేసుకునేందుకు వసతి, ఆరుగురు నిద్రించేందుకు వీలుగా కారవాన్‌లో ఏర్పాట్లు చేశారు. ఒక్కో వాహనంలో ఆరు నుంచి ఎనిమిది మంది వరకూ ప్రయాణించవచ్చు. పర్యటనలను మరింత సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా చేసేలా కారవాన్ రూపొందించారు. ప్రారంభ ఆఫర్ కింద కారవాన్‌ల ఒక రోజు అద్దె రూ.35 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. 

కారవాన్ టూరిజంతో ఉత్తరప్రదేశ్ పర్యాటక రంగానికి కొత్త ఊతం లభిస్తుందని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి జైవీర్ సింగ్ పేర్కొన్నారు. దేశీ టూరిజంలో ఉత్తరప్రదేశ్ దూసుకుపోతోందని, విదేశీ పర్యాటకులను కూడా ఇదే స్థాయిలో రాష్ట్రానికి ఆకర్షించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి వెల్లడించారు.


More Telugu News