జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో దొరికిన విష్ణుమూర్తి, హనుమంతుడి విగ్రహాలు

  • మధ్యయుగం ప్రారంభ కాలంనాటివిగా గుర్తింపు
  • గదాధారుడైన ఆంజనేయుడు.. శంకుచక్రాలతో విష్ణువు
  • సగం మనిషి, సగం సర్పం ఆకారంతో మరో విగ్రహం
  • మరో విగ్రహంలో విష్ణుమూర్తి పక్కన భక్తుడు, పరిచారకుడు
వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కింద ఇటీవల జరిపిన తవ్వకాల్లో కొన్ని హిందూ దేవతల విగ్రహాలు బయటపడినట్టు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో భారత పురతత్వశాఖ (ఏఎస్ఐ) ఇటీవల వెల్లడించింది. వాటిలో విష్ణువు, హనుమంతుడి విగ్రహాలు కూడా ఉన్నట్టు కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. మసీదు ఉన్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు శివాలయం ఉండేదన్న వాదన నేపథ్యంలో సుప్రీంకోర్టు అనుమతితో ఏఎస్ఐ తవ్వకాలు జరిపింది.

తవ్వకాల్లో బయటపడిన కళాఖండాల్లో విష్ణుమూర్తి, హనుమంతుడి విగ్రహాలు బయటపడడం అక్కడ అభివృద్ధి చెందిన సంస్కృతుల సమ్మేళనానికి నిదర్శనమని చెబుతున్నారు. తవ్వకాల్లో బయటపడిన వాటిలో సగం విరిగిన హనుమంతుడి విగ్రహం కూడా ఉంది. కింది సగభాగం మాత్రమే ఉన్న ఈ శిల్పం కాళ్లు ఓ రాతిపై ఉన్నాయి. ఇది ఆంజనేయుడి ఐకానిక్ భంగిమ కావడం గమనార్హం. మరో విగ్రహం మధ్యయుగ ప్రారంభం కాలం నాటిది. ఇందులో సగం మనిషి, సగం సర్పం ఉంది. ఈ విగ్రహం విష్ణుమూర్తి వరాహావతారాన్ని సూచిస్తోంది. 

అలాగే, నాలుగు చేతులతో ఉన్న సంప్రదాయ భంగిమలో శంకు, చక్రాలు ధరించి కూర్చుని ఉన్న విరిగిన విగ్రహం ఒకటి తవ్వకాల్లో వెలుగుచూసింది. అలాగే, మధ్యయుగ ప్రారంభం కాలంనాటి విష్ణువు రూపాలతో ఉన్న మరో రెండు శిల్పాలు లభ్యమయ్యాయి. ఇందులో ఒక విగ్రహం నాలుగు చేతులలో మూడు, ముఖం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఓ పీఠంపైన నిలబడిన ఆకారంలో ఉంది. మరోటి విష్ణువు పక్కన భక్తుడు, పరిచారిక ఉన్నట్టుగా ఉంది. మరో శిల్పం హనుమంతుడి పైభాగానికి సంబంధించినది. ఒక చేత్తో హనుమంతుడు గదాధారుడై ఉన్నాడు.


More Telugu News