దేవాలయం పిక్నిక్ స్పాట్ కాదు..: మద్రాస్ హైకోర్ట్ సంచలన తీర్పు

  • హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్తులను అనుమతించొద్దంటూ పిటిషన్ దాఖలు 
  • హిందూయేతరులను ధ్వజస్తంభం వరకే అనుమతించాలని కోర్టు ఆదేశం
  • ఈమేరకు ఆలయాల ముందు బోర్డులు ఏర్పాటు చేయాలని సూచన 
ఏ మతస్తులైనా వచ్చి పోయేందుకు హిందూ ఆలయాలేమీ పిక్నిక్ స్పాట్లు కావంటూ మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందూయేతరులను ఆలయం ముందు ఉండే ధ్వజస్తంభం వరకే అనుమతించాలని స్పష్టం చేసింది. ఈమేరకు హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్తుల ప్రవేశాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఇదే విషయాన్ని తెలియజేసేలా ఆలయాల ముందు బోర్డులు ఏర్పాటు చేయాలని ఎండోమెంట్ శాఖ అధికారులను ఆదేశించింది.

తమిళనాడులోని అర్లుమిగు పళని ధండాయుధపాణి స్వామి ఆలయంలోకి కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని, ఇతర మతస్తులు ఆలయంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరుతూ డి.సెంథిల్ కుమార్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలోని ఇతర మురుగన్ ఆలయాలకు కూడా హిందువులను మాత్రమే అనుమతించాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ ను మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ విచారించింది.

జస్టిస్ ఎస్.శ్రీమతి నేతృత్వంలోని బెంచ్.. పిటిషన్ దారుడి వాదనతో ఏకీభవిస్తూ ఆలయాల్లోకి హిందువులను మాత్రమే అనుమతించాలని స్పష్టం చేసింది. ఇతర మతస్తులను ఆలయంలోని ధ్వజస్తంభం వరకు అనుమతించవచ్చని సూచించింది. ఈమేరకు రాష్ట్రంలోని ఆలయాల్లో ఏర్పాట్లు చేయాలని, ప్రతీ ఆలయం ముందు బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.

‘హిందూ మతవిశ్వాసాలపై నమ్మకంలేని ఇతర మతస్తులను ఆలయంలోకి అనుమతించ వద్దు.. ఒకవేళ హిందూ మతవిశ్వాసాలపై నమ్మకంతో, భక్తుల నమ్మకాలను గౌరవిస్తూ ఆలయ దర్శనం కోరే ఇతర మతస్తులను ఆమేరకు హామీపత్రం తీసుకుని అనుమతించ వచ్చు. అయితే, ఆలయ సంప్రదాయాలను గౌరవిస్తూ, వాటికి అనుగుణంగా దర్శనానికి వచ్చినపుడే లోపలికి అనుమతించాలి’ అంటూ జస్టిస్ ఎస్ శ్రీమతి ప్రభుత్వానికి సూచించింది.


More Telugu News