రేపటి నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు... విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత

  • గత శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో భద్రతా వైఫల్యం
  • అనూహ్యరీతిలో చొరబడిన వ్యక్తులు
  • ఉభయ సభల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఎంపీలు
  • ఎంపీలపై నాడు సస్పెన్షన్ వేటు
  • లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ తో మాట్లాడిన కేంద్రమంత్రి జోషి
  • జనవరి 12న ముగ్గురు లోక్ సభ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేత
  • నేడు 11 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ తొలగింపు 
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపు (జనవరి 31) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా సస్పెన్షన్ కు గురైన 14 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ను ఎత్తివేశారు. 

నాడు పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని కోరుతూ విపక్షాలు ఉభయ సభలను హోరెత్తించాయి. ఆ సమయంలో ఉభయ సభల్లో 146 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు. వారిలో 132 మందిని శీతాకాల సమావేశాల ముగిసేంతవరకు సస్పెండ్ చేశారు. ఆ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో వారిపై సస్పెన్షన్ ఆటోమేటిగ్గా తొలగిపోయింది. 

మిగతా 14 మంది సస్పెన్షన్ వ్యవహారం ప్రివిలేజ్ కమిటీ వద్దకు చేరింది. ఆ 14 మందిలో 11 మంది రాజ్యసభ సభ్యులు కాగా, ముగ్గురు లోక్ సభ సభ్యులు.  వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్ సభ స్పీకర్ తోనూ, రాజ్యసభ చైర్మన్ తోనూ చర్చించారు. ముగ్గురు లోక్ సభ సభ్యులపై సస్పెన్షన్ ను జనవరి 12న ఎత్తివేశారు. 11 మంది రాజ్యసభ సభ్యులపై నేడు సస్పెన్షన్ తొలగించారు. దాంతో మొత్తం 146 మందిపై సస్పెన్షన్ తొలగిపోయినట్టయింది.

పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటులోకి ఆగంతుకులు చొరబడిన ఘటనలో సదరు ఎంపీలు సభలో తీవ్ర ఆందోళనలు చేపట్టారు. దాంతో ఆ ఎంపీలను సస్పెండ్ చేశారు.


More Telugu News