ఈయన మాకు అవసరం లేదు: నితీశ్ కుమార్ వ్యవహారంపై తొలిసారి స్పందించిన రాహుల్  గాంధీ

  • కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేసి కూటమి నుంచి తప్పుకున్న నితీశ్
  • బీజేపీతో చేయి కలిపి మరోసారి బీహార్ సీఎంగా ప్రమాణస్వీకారం
  • కొంచెం ఒత్తిడి తగలగానే యూ-టర్న్ తీసుకున్నాడన్న రాహుల్ 
ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోందంటూ ఆరోపణలు చేసి, బీహార్ లో మహా ఘట్ బంధన్ కూటమికి గుడ్ బై చెప్పిన బీహార్ సీఎం నితీశ్ కుమార్... బీజేపీతో జట్టుకట్టి మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో, నితీశ్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిసారిగా స్పందించారు. ఈయన (నితీశ్ కుమార్) మాకు అవసరం లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొద్దిగా ఒత్తిడి తగలగానే యూ-టర్న్ తీసుకున్నాడు అని విమర్శించారు. 

ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బీహార్ లో కొనసాగుతోంది. బీహార్ లో పూర్ణియా వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

బీహార్ లో కులగణన కారణంగానే నితీశ్ కూటమి నుంచి తప్పుకున్నాడని, కులగణనపై కాంగ్రెస్ పట్టుబట్టడం నితీశ్ కు నచ్చలేదని అన్నారు. బీహార్ లో మహా ఘట్ బంధన్ కూటమి సామాజిక న్యాయం కోసం పోరాడుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.


More Telugu News