మానవుడి మెదడులో తొలి న్యూరాలింక్ చిప్ అమరిక.. ప్రకటించిన ఎలాన్ మస్క్

  • ఓ పేషెంట్ మెదడులో ఒక న్యూరాలింక్ చిప్‌ను అమర్చినట్టు వెల్లడించిన మస్క్
  • ఆశాజనక ఫలితాలు వస్తున్నాయని ప్రకటన
  • మనిషి మెదడు, కంప్యూటర్‌ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచడమే ప్రయోగ లక్ష్యం
నేరుగా మనిషి మెదడు, కంప్యూటర్‌ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచడమే లక్ష్యంగా టెస్లా దిగ్గజం ఎలాన్ మస్క్ సహ వ్యవస్థాపకుడిగా 2016లో స్థాపించిన న్యూరోటెక్నాలజీ కంపెనీ ‘న్యూరాలింక్’ కీలకమైన ప్రయోగాన్ని చేపట్టింది. మొట్టమొదటిసారిగా ఒక పేషెంట్ మెదడులో న్యూరాలింక్ చిప్‌ను అమర్చింది. ఈ ప్రయోగం ఆశాజనక ఫలితాలను కూడా అందిస్తోంది. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ ‘ఎక్స్’ వేదికగా స్వయంగా వెల్లడించారు. ‘‘నిన్న మొదటిసారి మనిషి మెదడులో న్యూరాలింక్‌ను అమర్చారు. పేషెంట్ కోలుకుంటున్నాడు. ప్రారంభ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. నాడీ కణాలను గుర్తించడం కచ్చితంగా కనిపిస్తోంది’’ అని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.

మనిషి సామర్థ్యాలను ఉత్తేజం చేయడం, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధులకు చికిత్స ప్రధాన లక్ష్యాలుగా ఈ ప్రయోగం కొనసాగుతోంది. మనుషులు, కృత్రిమ మేధస్సు మధ్య సహజీవన సంబంధాన్ని సాధించడం కూడా ఒక ఆశయంగా ఉందని గతంలో కంపెనీ పేర్కొంది. మనిషి మెదడులో చిప్‌‌ను అమర్చేందుకు అమెరికా నియంత్రణ సంస్థ నుంచి గతేడాది అనుమతి లభించడంతో ఈ ప్రయోగం చేపట్టారు.

పేర్చబడిన 5 నాణేల పరిమాణంలో ఉండే చిప్‌ను సర్జరీ ద్వారా మనిషి మెదడులో అమర్చుతారు. ‘లింక్’ సాంకేతికత ప్రధానంగా ఈ చిప్ పనిచేస్తుంది. కాగా కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ‘న్యూరాలింక్’ కంపెనీలో 400 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రయోగాల కోసం కంపెనీ ఇప్పటికే 363 మిలియన్ డాలర్ల నిధులు సేకరించింది.


More Telugu News