సీఎం రేవంత్ రెడ్డి గారు అలా చెప్పడం చాలా ఆనందం కలిగించింది: దిల్ రాజు

  • నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ నిర్మాతలు
  • నేడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన దిల్ రాజు
  • సీఎం చాలా పాజిటివ్ గా స్పందించారని వెల్లడి
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి కొంతమంది నిర్మాతలు నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు కూడా పాల్గొన్నారు. నేడు దిల్ రాజు, ఇతర సినీ సంఘాల పెద్దలు హైదరాబాదులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ ప్రెస్ మీట్లో దిల్ రాజు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం దాదాపు 1 గంటా 15 నిమిషాల పాటు సాగిందని వెల్లడించారు. ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి చర్చించామని తెలిపారు. తాము చెప్పిన విషయాలను సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ఓపిగ్గా విన్నారని వివరించారు. 

"సమస్యలను వివరించడమే కాదు, సమస్యల పరిష్కారాలు కూడా మీరే తీసుకురండి... ప్రభుత్వం నుంచి ఏం సహాయం కావాలన్నా చేయడానికి మేము రెడీగా ఉన్నాము అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. ఉన్న సమస్యలన్నింటి మీద ఎల్లుండి ఈసీ మీటింగ్ పెట్టుకుని దాంట్లో సమస్యలు అన్నింటికి పరిష్కారాలను తీసుకుని మళ్ళీ అతి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి వివరిస్తాం. 

నిన్నటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించిన విధానం చాలా పాజిటివ్ గా అనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించిన విధానానికి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎల్లుండి ఈసీ మీటింగ్ లో ఈ విషయాలపై సమగ్రంగా చర్చిస్తాం. మున్ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్ తరాలకు ఒక మంచి వారధిని నిర్మించడానికి నిర్ణయించుకున్నాము" అని దిల్ రాజు పేర్కొన్నారు.


More Telugu News