నాది విజన్ అయితే జగన్ ది పాయిజన్: చంద్రబాబు

  • పొన్నూరులో రా... కదలి రా సభ
  • సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు
  • ఇదేనా నీ మార్కు అంటూ విమర్శనాస్త్రాలు
  • టీడీపీ మార్కు ఇదీ అంటూ వివరణ 
టీడీపీ అధినేత చంద్రబాబు పొన్నూరు రా... కదలి రా సభలో వైసీపీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాదెప్పుడూ ఒక విజన్... జగన్ మోహన్ రెడ్డిది పాయిజన్ అంటూ వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంతో ఈ రోజే ఊహించి, అందుకు కార్యాచరణ తయారుచేస్తామని వెల్లడించారు. అందుకు హైదరాబాదే ఒక నమూనా అని తెలిపారు. ఆ రోజు తాము ఐటీకి ప్రాధాన్యత ఇచ్చామని, తమ కార్యాచరణను నమ్మి చదివిన వాళ్లంతా ప్రపంచమంతా వెళ్లారని, బ్రహ్మాండంగా రాణిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. 

"హైదరాబాద్ వంటి నగరాన్ని మళ్లీ కట్టాలని అమరావతికి శ్రీకారం చుట్టాను. ఆ అమరావతి వచ్చుంటే ఈ ప్రాంతం ఎంతో ముందుకు వెళ్లి ఉండేది. రాజధాని కోసం 35 వేల ఎకరాల భూమిని 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఒక్క చిన్న లిటిగేషన్ కూడా లేదు. కానీ ఇతను (జగన్) వచ్చి కులం రంగు పులిమాడు, పంట కాలువలు కూడా తవ్వలేడు కానీ మూడు రాజధానులు అన్నాడు. మూడు ముక్కలాట ఆడి మొత్తం రాజధాని అంశాన్ని నాశనం చేశాడు. 

రాష్ట్ర ప్రజలను కోరుతున్నా... నేను శాశ్వతం కాదు, జగన్ మోహన్ రెడ్డి శాశ్వతం కాదు. మీరు శాశ్వతం, సమాజం శాశ్వతం. సమాజానికి ద్రోహం చేసిన జగన్ మోహన్ రెడ్డిని వదిలిపెడతారా? అమరావతి లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. 

ఇవాళ దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ. సైబరాబాద్ రూపంలో ఆనాడు మనం వేసిన పునాదే అందుకు కారణం. అమరావతిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు కట్టాం. అన్నీ కడితే కావాలనే అన్నీ విధ్వంసం చేశారు. చివరికి అమరావతి రోడ్లపై ఉండే గ్రావెల్ దొంగలించే పరిస్థితి వచ్చింది" అంటూ వివరించారు. 

ఇది దేవతల రాజధాని... సైకోలు వచ్చినా ఏం చేయలేరు!

అమరావతి దేవతల రాజధాని. మన రాజధానిని సైకోలు వచ్చినా ఏం చేయలేరు. మన రాజధాని అమరావతే... ఐదు కోట్ల మంది నినాదం ఇదే. అమరావతి రాజధాని తప్పకుండా సాధ్యమవుతుంది. ఇది సాధ్యం కావాలంటే ఫ్యానుకున్న మూడు రెక్కలు విరిచిపడేయాలి! రెక్కలు లేని మొండి ఫ్యానును రివర్స్ సీఎంకు అందిస్తే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని హ్యాపీగా ఆలోచించుకుంటాడు. 

ఇదేనా జగన్ మార్కు..?

రాష్ట్రంలో జగన్ మార్కు అంటూ కొత్త నాటకాలు తెరపైకి తెచ్చారు. విద్యుత్ బిల్లులను విపరీతంగా పెంచడమేనా జగన్ మార్కు? పెట్రోల్, డీజిల్ ధరలు యధేచ్ఛగా పెంచడమేనా జగన్  మార్కు? రాష్ట్రంలో 24 శాతం నిరుద్యోగం నెలకొనడమే జగన్  మార్కు, రివర్స్ నిర్ణయాలతో రివర్స్ పాలనే జగన్ మార్కు. గంజాయి సరఫరాలో ఏపీని నెంబర్ వన్ చేయడమే జగన్ మార్కు. 

ఇది టీడీపీ మార్కు

డ్వాక్రా మహిళలతో పొదుపు చేయించడం టీడీపీ మార్కు. పేద పిల్లల ఉన్నత చదువుల కోసం విదేశీ విద్య పథకం అందించడం టీడీపీ మార్కు. దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ టీడీపీ మార్కు. రైతు బిడ్డలను లక్షాధికారులను చేయడం టీడీపీ మార్కు. మహిళల ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్ల నిర్మాణం టీడీపీ మార్కు. ఐదేళ్లలో 6 లక్షల మందికి ఉపాధి కల్పన టీడీపీ మార్కు. 

ఇప్పుడొచ్చి 'సిద్ధం' అంటున్నాడు... మేము సైతం సిద్ధం!

రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేసిన వ్యక్తి ఇప్పుడొచ్చి 'సిద్ధం' అంటున్నాడు. ఇప్పుడు మేం కూడా చెబుతున్నాం... మేము సైతం సిద్ధం. వైసీపీని చిత్తుగా ఓడించడానికి మేం సిద్ధం. మీ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం. మొన్నటివరకు నాకు అడ్డమే లేదన్నాడు... మీరు నా వెంట్రుక పీకుతారా? అన్నాడు. ఇంత అహంభావం ఉన్న వ్యక్తి ఈ ప్రపంచంలో ఇంకొకరు లేరు. 

జగన్ ఓ సైకో... అందుకు నాలుగు ఉదాహరణలు చెబుతాను. మొన్న విశాఖలో వాళ్ల మీటింగ్ జరిగింది. అక్కడ నా కటౌట్, పవన్ కల్యాణ్ కటౌట్, మరో ఇద్దరి కటౌట్లు పెట్టారు. ఆ కటౌట్లను బూటు కాళ్లతో కొడుతూ పైశాచిక ఆనందం పొందారు. ఇప్పుడిక్కడ మనం ఆయన (జగన్) ఫొటో పెట్టి కొట్టలేమా? కిందపడేసి తొక్కలేమా? కానీ మనకు సంప్రదాయం అడ్డొస్తోంది. కానీ సైకోకు అలాంటి సంప్రదాయల్లేవు. 

మాచర్లలో దుర్గారావు అనే మత్స్యకారుడ్ని పార్టీ మారమన్నారు.. పార్టీ మారేదిలేదని దుర్గారావు బదులిచ్చాడు. దాంతో అక్కడి ఎస్సై దుర్గారావును స్టేషన్ కు పిలిపించి కొట్టి, టార్చర్ చేసేసరికి, దుర్గయ్య ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

అంతకుముందు, చంద్రయ్య అనే వ్యక్తితోనూ ఇలాగే వ్యవహరించారు. జై జగన్ అంటే ప్రాణాలతో వదిలేస్తాం అన్నారు... కానీ చంద్రయ్య జై చంద్రబాబు అంటూ ప్రాణాలు వదిలాడు. ఆ రోజు నేను చంద్రయ్య పాడె మోశాను. అలాంటి కుటుంబాలకు ఎప్పటికీ నా జీవితంలో రుణపడి ఉంటాను. 

మొన్ననే అనంతపురం జిల్లాలో ఓ వితంతువు పెన్షన్ కోసం అడిగితే, నా కోరిక తీర్చితే పెన్షన్ ఇస్తానని నటరాజ్ అనే వాడు చెబుతాడు. నేనలాంటి దాన్ని కాదని ఆ అమ్మాయి చెబితే, అతడు నడిరోడ్డుపై ఆ అమ్మాయిని కొడుతుంటే పోలీసులు ఒక్కరు కూడా రాలేదు. 

ఈ ఆంబోతుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, లేదా? ఇలాంటి ఆంబోతులను కట్టేస్తా... అవసరమైతే బట్టలు విప్పి ఊరేగిస్తా. ఇలాంటివాళ్లను కట్టడి చేయడానికి నేను సిద్ధం... మీరు సిద్ధమా?... అంటూ చంద్రబాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు.


More Telugu News