కోహ్లీ నాపై ఉమ్మేశాడు: డీన్ ఎల్గార్

  • ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన డీన్ ఎల్గార్
  • 'బాంటర్ విత్ బాయ్స్' పోడ్ కాస్ట్ లో సంచలన విషయాల వెల్లడి
  • 2015 సిరీస్ లో కోహ్లీతో గొడవ గురించి వివరణ 
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్ ఎల్గార్ ఓ పోడ్ కాస్ట్ లో సంచలన విషయాలు వెల్లడించాడు. 'బాంటర్ విత్ బాయ్స్' అనే ఈ పోడ్ కాస్ట్ కు హాజరైన ఎల్గార్ మాట్లాడుతూ... టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ తనపై ఉమ్మేశాడని తెలిపాడు. 

"అది భారత్ లో నా తొలి పర్యటన. ఓ టెస్టులో నేను బ్యాటింగ్ కు దిగాను. కోహ్లీని ప్రత్యక్షంగా చూడడం అదే మొదటిసారి. ఆ మ్యాచ్ కు మొహాలీ వేదిక. అక్కడి పిచ్ చూస్తే ఓ జోక్ లా అనిపించింది. అలాంటి పిచ్ పై బ్యాటింగ్ ఓ సవాలుగా నిలిచింది. బ్యాటింగ్ చేస్తున్న నాపై అశ్విన్, జడేజా మాటలు తూటాలు విసురుతున్నారు. నేను కూడా వారికి దీటుగా జవాబు చెబుతున్నాను.

కానీ కోహ్లీ మధ్యలో వచ్చి నాపై ఉమ్మేశాడు. దాంతో నేను ఓ బూతు మాట ఉపయోగించి, బ్యాట్ తో కొడతానంటూ కోహ్లీని హెచ్చరించాను. అది 2015 నాటి సిరీస్. అప్పటికి కోహ్లీ ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్నాడు. ఆ జట్టులోనే దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ కూడా ఉన్నాడు. అందువల్ల దక్షిణాఫ్రికా యాస గురించి, నేను వాడిన బూతు మాట గురించి కోహ్లీకి అవగాహన ఉంటుందనే అనుకున్నాను. 

నేనా మాట అనగానే కోహ్లీ కూడా అదే బూతు మాటను ఉచ్ఛరిస్తూ హేళన చేయడం మొదలుపెట్టాడు. దాంతో... వీడితో పెట్టుకోవడం అనవసరం అనిపించింది. ఆ తర్వాత 2017-18 సీజన్ లో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చింది. కోహ్లీ నా వద్దకు వచ్చి... నేను చెప్పేది విను... ఈ సిరీస్ ముగిసిన తర్వాత మనిద్దరం కలిసి డ్రింక్ చేద్దామా? నేను ప్రవర్తించిన తీరు పట్ల క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను అని అన్నాడు. 

కోహ్లీ ప్రతిపాదనకు నేను అంగీకరించాను. ఆ సిరీస్ అయిపోగానే ఇద్దరం పార్టీ చేసుకున్నాం. వేకువజామున 3 గంటల వరకు మేమిద్దరం తాగుతూనే ఉన్నాం" అంటూ ఎల్గార్ వివరించాడు. 

ఇటీవల ఎల్గార్ కెరీర్ లో చివరి టెస్టు ఆడింది టీమిండియా పైనే. ఎల్గార్ చివరి ఇన్నింగ్స్ ఆడగానే కోహ్లీ అతడిని ఆత్మీయంగా హత్తుకుని శుభాకాంక్షలు తెలిపాడు.


More Telugu News