నేను రేవంత్ రెడ్డిని కలవగానే పార్టీ పెద్దలకు సమాచారం ఇచ్చాను: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

  • తనకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని, రేవంత్ రెడ్డికి చేర్చుకునే ఆలోచన లేదన్న ప్రకాశ్ గౌడ్
  • తనను రేవంత్ రెడ్డి ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించారన్న ఎమ్మెల్యే
  • ముఖ్యమంత్రిని కలవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని స్పష్టీకరణ
తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంపై రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వివరణ ఇచ్చారు. తనకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని... అదే సమయంలో రేవంత్ రెడ్డికి తనను కాంగ్రెస్‌లో చేర్చుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తాను రేవంత్ రెడ్డిని కలిశాక పార్టీ పెద్దలకు సమాచారం ఇచ్చానన్నారు. నిన్న ఆయన రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయన పార్టీ మారుతారా? అనే చర్చ సాగింది. ఈ నేపథ్యంలో ప్రకాశ్ గౌడ్ స్పందించారు. తన నియోజకవర్గ అభివృద్ధి, మూసీ సుందరీకరణ, బహదూర్‌పురా భూములు... తదితర అంశాలపై తాను ముఖ్యమంత్రిని కలిశానన్నారు. తన ప్రతిపాదనలకు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

తనను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించారన్నారు. ముఖ్యమంత్రిని కలవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో బహదూర్‌పురా, కోత్వాల్‌గూడ, ఘస్మియాగూడ గ్రామాలలో రైతులకు పట్టా పాసు పుస్తకాల సమస్యలు ఉన్నాయని, దీనిని సీఎం దృష్టికి తీసుకు వెళ్లానన్నారు. తాను ముఖ్యమంత్రిని కలిశాక పార్టీ అధిష్ఠానానికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.


More Telugu News