నేను ఆ పార్టీలో పదేళ్లు పనిచేశాను... తప్పు చేస్తే నిరూపించమనండి: మంత్రి రోజా

  • మంత్రి రోజాపై వైసీపీ కౌన్సిలర్ సంచలన ఆరోపణలు
  • సొంత పార్టీ నేత నుంచి డబ్బులు తీసుకుందంటూ చంద్రబాబు వ్యాఖ్యలు
  • పదవులు అమ్ముకుంటున్నానని 24 ఏళ్ల తర్వాత కనిపించిందా అంటూ రోజా ఫైర్ 
టీడీపీ అధినేత చంద్రబాబు పీలేరు రా... కదలి రా సభలో మంత్రి రోజాపై పరోక్ష వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇదే జిల్లాలో ఉన్న టూరిజం మంత్రి సొంత పార్టీకి చెందిన కార్యకర్త నుంచి నామినేటెడ్ పదవి కోసం డబ్బులు తీసుకుంది అని ఆరోపించారు. దీనిపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. ఈ పెద్ద మనిషి నా గురించి మాట్లాడడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. 

"నేను ఆ పార్టీలో పదేళ్లు పనిచేశాను. ఆ పదేళ్లలో నేను తప్పు చేశాననో, ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి తీసుకున్నాననో నిరూపించమనండి. నేను మీ పార్టీలో పనిచేసిన వ్యక్తినే కదా... నేను పదవులు అమ్ముకుంటున్నానని ఆయనకు 24 ఏళ్ల తర్వాత కనిపించింది. దీన్ని బట్టి ఆయన ముఖ్యమంత్రి స్థాయి నుంచి మా స్థాయికి పడిపోయారని గమనించాలి. 

ఎవరో తెలియని సామాన్యులను మనం కౌన్సిలర్ చేసినప్పుడు వారు అమ్ముడుపోయి మాట్లాడరని ఎలా అనుకుంటారు? వాళ్ల వ్యాపారం ఏంటో కనుక్కోండి. వాళ్లు ఈ రోజు కౌన్సిలర్ అయ్యారంటే వైసీపీ పుణ్యమే. సామాన్యులను కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేసిన వ్యక్తి వైఎస్ జగన్ గారు. ఆయన బాటలోనే మేం కూడా నడస్తున్నాం. 

రాజకీయ అర్హత లేకపోయినా... మంచి వాళ్లను, పేదవాళ్లను పైకి తీసుకురావాలన్న క్రమంలో వీళ్లు వచ్చారే తప్ప, వీళ్లు పార్టీ జెండా మోసింది లేదు, పార్టీ కోసం పనిచేసిన వాళ్లు కాదు. కానీ వీళ్లు కృతజ్ఞత లేకుండా, ఎవరో చెప్పిన మాటలకో, దేనికో లొంగిపోయి నాపై నిందలు వేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు చేస్తే భగవంతుడు కచ్చితంగా సమాధానం చెబుతాడు. 

జగనన్నలాగానే నేను కూడా భగవంతుడ్ని నమ్ముతాను... ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చాను. నన్ను ఎన్ని మాటలు అన్నా భగవంతుడికే వదిలేస్తాను. ఇలా మాట్లాడిన వాళ్లందరూ కాలగర్భంలో కలిసిపోయారు. చరిత్ర చూస్తే మీకే అర్థమవుతోంది" అంటూ రోజా వివరించారు.


More Telugu News