భారతీరెడ్డితో కలిసే నా భర్త అనిల్ సోనియాగాంధీ వద్దకు వెళ్లారు: వైఎస్ షర్మిల

  • అనునిత్యం ప్రజల్లో ఉండటం వైఎస్సార్ మార్క్ అన్న షర్మిల
  • కడపకు జగన్ చేసిందేమీ లేదని విమర్శ
  • షర్మిలను సీఎం కావాలనుందని తన భర్త చెప్పినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
నా అనుకున్న వాళ్ల కోసం ఎందాకైనా వెళ్లడం వైఎస్సార్ వ్యక్తిత్వమని... అనునిత్యం ప్రజల్లో ఉండటం ఆయన మార్క్ అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఇప్పుడున్న పాలకులు పెద్దపెద్ద కోటలు కట్టుకుని ప్రజలకు దూరంగా ఉంటున్నాని విమర్శించారు. వైఎస్ బతికుంటే కడప ఎంతో అభివృద్ధి చెందేదని చెప్పారు. బీజేపీకి స్నేహితుడిగా ఉన్న జగన్... కడపకు చేసిందేమీ లేదని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన చేసిన జగన్... ప్లాంట్ నిర్మాణాన్ని ఎందుకు చేపట్టలేకపోయారని ప్రశ్నించారు. విభజన హామీల్లో కడప స్టీల్ ప్లాంట్ ఒకటని గుర్తు చేశారు.  కడప - బెంగళూరు రైల్వే లైన్ ను ఎందుకు సాధించలేకపోయారని దుయ్యబట్టారు. 

ఇదే సమయంలో తన వదిన వైఎస్ భారతి అంశాన్ని కూడా ఆమె తీసుకొచ్చారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా తన భర్త అనిల్ కుట్రలు చేశారనే ఆరోపణలపై మండిపడ్డారు. జగన్ ను బయటకు రానివ్వొద్దని, షర్మిలను సీఎం చేయాలని లాబీయింగ్ చేసినట్టు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

షర్మిలకు సీఎం కావాలనుందని, ప్రణబ్ ముఖర్జీతో, సోనియాతో తన భర్త చెప్పినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భారతీరెడ్డితో కలిసే సోనియాగాంధీ వద్దకు అనిల్ వెళ్లారని తెలిపారు. మరి సోనియాతో తన భర్త ఈ విషయం గురించి భారతీరెడ్డి ముందు మాట్లాడారా? లేక వెనుక మాట్లాడారా? అని ప్రశ్నించారు. తనకు పదవులే కావాలనుకుంటే తన తండ్రి సీఎం అయినప్పుడే తీసుకునేదాన్నని చెప్పారు.


More Telugu News