పోటీతత్వం, సవాళ్లు జీవితంలో స్ఫూర్తినిస్తాయి: 'పరీక్ష పే చర్చా' కార్యక్రమంలో ప్రధాని మోదీ

  • ఢిల్లీలోని భారత్ మండపంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కార్యక్రమం 
  • విద్యార్థుల్లో పోటీతత్వం ఆరోగ్యకరంగా ఉండాలన్న ప్రధాని
  • విద్యార్థులందరినీ సమానంగా చూడాలని ఉపాధ్యాయులకు హితవు
  • పిల్లలపై ఒత్తిడి తేవొద్దని తల్లిదండ్రులకు సూచన
పోటీతత్వం, సవాళ్లు జీవితంలో ఎంతో స్ఫూర్తినిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన 'పరీక్ష పే చర్చ' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పరీక్షల ముందు విద్యార్థుల్లో ఒత్తిడిని పోగొట్టడానికి ప్రధాని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ కాలం విద్యార్థులు కొత్తగా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల్లో పోటీతత్వం తప్పనిసరిగా ఉండాలని... కానీ అది ఆరోగ్యకరంగా ఉండాలని సూచించారు. తోటి విద్యార్థులతో పోల్చుకోవద్దని... మీకు సాధ్యమైనంతగా చేసుకుంటూ ముందుకు సాగాలని విద్యార్థులతో అన్నారు. మీ మిత్రుల విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. 

పక్కవారితో పోటీ పడవద్దని... మీతో మీరే పోటీ పడాలన్నారు. కొన్నిసార్లు విద్యార్థులు స్థాయికి తగినట్లుగా రాణించలేకపోతున్నామని ఒత్తిడికి లోనవుతుంటారని... ప్రిపరేషన్ సమయంలో చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకొని... క్రమంగా మీ పనితీరును మెరుగుపరుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. అలా చేస్తే మీరు పరీక్షలకు ముందే సిద్ధమవుతారన్నారు. ఆరోగ్యకరమైన మేథస్సు కోసం ఆరోగ్యమైన శరీరం కూడా అవసరమని పేర్కొన్నారు.

ఉపాధ్యాయులకు మోదీ సూచన

విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం మొదటి రోజు నుంచే ప్రారంభం కావాలన్నారు. అప్పుడే పరీక్షల సమయంలోనూ పిల్లలు ఒత్తిడికి గురికారన్నారు. ఉపాధ్యాయులు తమ ఉద్యోగాన్ని కేవలం జాబ్‌గా భావించకూడదని... విద్యార్థుల భవిష్యత్తు... సాధికారత కోసం పని చేస్తున్నట్లుగా గుర్తించాలన్నారు. ప్రతి విద్యార్థిని కూడా ఉపాధ్యాయులు సమానంగా చూడాలని సూచించారు. 

తల్లిదండ్రులకు మోదీ సూచన

రోజుకు పది నుంచి పన్నెండు గంటలు చదవాలని తల్లిదండ్రులు తమ పిల్లల పైన ఒత్తిడి తేవొద్దని ప్రధాని మోదీ సూచించారు. మీ పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను మీరు విజిటింగ్ కార్డులా భావించి వారిపై ఒత్తిడి తేవొద్దని విజ్ఞప్తి చేశారు. మీ పిల్లలను ఇతర విద్యార్థులతో పోల్చవద్దని సూచించారు. అలా చేస్తే వారి భవిష్యత్తుకు హాని కలిగించిన వారవుతారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఎప్పుడూ విశ్వాసం తగ్గిపోకూడదన్నారు. విద్యార్థులు దేశ భవిష్యత్తు నిర్మాతలని... అందుకే ఈ కార్యక్రమం తనకూ ఓ పరీక్షలాంటిదేనని ప్రధాని అన్నారు.


More Telugu News