ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా వైఫల్యం.. గోడదూకి రన్‌వేపైకి దూసుకొచ్చిన మందుబాబు

  • రిపబ్లిక్ రోజునే ఘటన
  • రాత్రి 11.30 గంటల సమయంలో రన్‌వేపై మందుబాబును గుర్తించిన ఎయిర్ ఇండియా పైలట్
  • హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన సీఐఎస్ఎఫ్
ఢిల్లీలోని అంతర్జాతీయ విమనాశ్రయంలో భద్రతా వైఫల్యం మరోమారు బయటపడింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి రక్షణ గోడ దూకి రన్‌వేపైకి దూసుకొచ్చాడు. రిపబ్లిక్ డే నాడు జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విమానాశ్రయ భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) పర్యవేక్షిస్తోంది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. 

రన్‌వేపైకి దూసుకొచ్చిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో రన్‌వేపైకి వచ్చిన నిందితుడిని ఎయిర్ ఇండియా పైలట్ గుర్తించి ఏటీసీకి సమాచారం అందించాడు. ఏటీసీ ఆ విషయాన్ని సీఐఎస్ఎఫ్‌కి తెలియజేసింది. నిందితుడిది హర్యానాగా గుర్తించిన సీఐఎస్ఎఫ్ అధికారులు అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News