రేవంత్ ను కలిసిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

  • రేవంత్ తో భేటీ అయిన ప్రకాశ్ గౌడ్
  • గతంలో టీడీపీలో కలిసి పని చేసిన రేవంత్, ప్రకాశ్
  • మర్యాదపూర్వకంగానే కలిశానంటున్న ప్రకాశ్ గౌడ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇటీవల నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం రాజకీయంగా ప్రకంపనలు పుట్టించింది. ఇది జరిగి రోజులు కూడా గడవక ముందే మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్ నియోజకవర్గం) రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా రేవంత్ మిత్రుడు వేం నరేందర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. వీరు దాదాపు గంట సేపు చర్చలు జరిపారు. రేవంత్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ గతంలో తెలుగుదేశం పార్టీలో కలిసి పని చేశారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ప్రకాశ్ గౌడ్ గెలుపొందారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. 

ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరగనుంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ ను ప్రకాశ్ గౌడ్ కలవడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను ప్రకాశ్ గౌడ్ కలిశారు. అయితే తాను మర్యాదపూర్వకంగానే పొన్నం ప్రభాకర్ ను కలిశానని ప్రకాశ్ గౌడ్ తెలిపారు. 

రేవంత్ రెడ్డిని కలవడంపై ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ... మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. తన నియోజకవర్గ సమస్యలపై రేవంత్ తో మాట్లాడానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్దికి నిధులు మంజూరు చేయాలని తాను కోరగా... రేవంత్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.


More Telugu News