హైదరాబాద్ టెస్టులో ఓడిపోయిన టీమిండియాకి షాక్.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 3 స్థానాలు పతనం

  • వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 5వ స్థానానికి పడిపోయిన భారత్
  • ఇంగ్లండ్ చేతిలో ఓటమితో 54.16 నుంచి 43.33కు తగ్గిన పాయింట్లు
  • టాప్‌లో ఆసీస్.. వరుసగా 2, 3, 4వ స్థానాల్లో నిలిచిన దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్
హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అనూహ్యంగా 28 పరుగుల తేడాతో ఓటమి పాలైన టీమిండియాకు షాక్ తగిలింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC) పాయింట్ల పట్టికలో భారత్ 5వ స్థానానికి దిగజారింది. ఈ ఓటమితో భారత్ పాయింట్లు 54.16 నుంచి 43.33కి తగ్గాయి. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో మూడు స్థానాలు దిగజారి ఐదో స్థానానికి పడిపోయింది. వెస్టిండీస్ చేతిలో ఓటమి పాలవ్వడంతో ఆస్ట్రేలియా పాయింట్లు 61.11 నుంచి 55కి తగ్గినప్పటికీ ఆ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. 50 పాయింట్లతో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ వరుసగా 2, 3, 4వ స్థానాల్లో ఉన్నాయి.

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక
1. ఆస్ట్రేలియా
2. దక్షిణాఫ్రికా
3. న్యూజిలాండ్
4. బంగ్లాదేశ్
5. భారతదేశం
6. పాకిస్థాన్ 
7. వెస్టిండీస్
8. ఇంగ్లాండ్
9. శ్రీలంక

ఇండియాపై గెలిచినప్పటికీ ఇంగ్లండ్ టీమ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో 8వ స్థానానికే పరిమితమైంది. ఓవర్-రేట్ కారణంగా ఆ జట్టు 19 పాయింట్లు కోల్పోయింది. ఫలితంగా 8వ స్థానానికి పరిమితమైంది. ఇక బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ చారిత్రాత్మక విజయం సాధించినప్పటికీ 7వ స్థానానికే పరిమితమైంది. అంతకు ముందు సిరీస్‌లలో దారుణంగా విఫలమవ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కాగా హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లిష్ బ్యాటర్ ఒల్లీ పోప్ 196 పరుగులతో అద్భుతంగా రాణించాడు. అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే టామ్ హార్ట్లీ కూడా చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 7 వికెట్లు తీశాడు. మొదటి రెండు రోజులు టీమిండియా ఆధిపత్యం చెలాయించగా ఇంగ్లండ్ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. 3వ, 4వ రోజు ఆటలో స్పష్టమైన ఆధిపత్యాన్ని చెలాయించి అద్భుతమైన విజయాన్ని దక్కించుకున్నారు.


More Telugu News