ఇండియా కూటమి నుంచి నితీశ్ కుమార్ వైదొలగడానికి అసలు కారణం చెప్పిన జేడీయూ కీలక నేత

  • ఇండియా కూటమి నాయకత్వాన్ని హైజాక్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందన్న కేసీ త్యాగి
  • కుట్రలో భాగంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఖర్గే ప్రతిపాదించారని ఆరోపణ
  • బీజేపీపై పోరాడేందుకు ఇండియా కూటమి వద్ద ప్రణాళికలు లేవని విమర్శలు
సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూ పార్టీ ఇండియా కూటమితో తెగతెంపులు చేసుకుంది. కూటమి నుంచి వైదొలగింది. ఈ మేరకు బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం నితీశ్ కుమార్ ముఖ్యమంత్రికి రాజీనామా చేసి ఆర్జేడీ మద్ధతును ఉపసంహరించుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే బీజేపీ మద్ధతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఇండియా కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు మీడియాకు వెల్లడించారు. ఈ విధంగా ఇండియా కూటమి నుంచి వైదొలగడంపై జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి వివరణ ఇచ్చారు.  

ఇండియా కూటమి నాయకత్వాన్ని హైజాక్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని కేసీ త్యాగి ఆరోపించారు. ఈ మేరకు తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో కలిసి హస్తంపార్టీ కుట్ర పన్నిందని అన్నారు. 

‘‘డిసెంబర్ 19న జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కుట్ర బయటపడింది. ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రతిపాదించారు. కుట్రపూరితంగా మమతా బెనర్జీ ద్వారా ఖర్గే పేరును ప్రతిపాదించారు’’ అని కేసీ త్యాగి అన్నారు. 

సీట్ల సర్దుబాటు ప్రక్రియకు కాంగ్రెస్‌ అడ్డుపడిందని, మిత్రపక్షాల ముందు అసంబద్ధ డిమాండ్‌లు ఉంచుతూ, ఇతర పార్టీల నేతలను అవమానాలకు గురిచేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ చర్యలు ఇండియా కూటమి ఐక్యత, సమర్ధతకు హానికరంగా ఉన్నాయని విమర్శించారు. 

సీట్ల సర్దుబాటు ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ వెనక్కు లాగుతూనే ఉందని, సీట్ల పంపకం తక్షణమే జరగాలని తాము చెబుతూనే ఉన్నామని, బీజేపీకి వ్యతిరేక పోరాటంలో ఇండియా కూటమి వద్ద ప్రణాళికలే లేవని ఆయన విమర్శించారు. ఇండియా కూటమి పతనానికి కారణాలు ఇవేనని అన్నారు.

కాగా బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్‌తో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయలేకపోవడం వల్లే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు సీఎం నితీశ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. రాజీనామా సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ సభ్యులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే సీఎం పదవికి రాజీనామా చేశానని, ఈ మేరకు తనకు సలహాలు అందాయని చెప్పిన విషయం తెలిసిందే.


More Telugu News