హైదరాబాద్ టెస్టులో టీమిండియా ఓటమి... స్పిన్ తో కొట్టిన ఇంగ్లండ్

  • టీమిండియా, ఇంగ్లండ్ మధ్య 5 టెస్టుల సిరీస్
  • నాలుగు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టు
  • 28 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం
  • 7 వికెట్లతో రాణించిన ఇంగ్లండ్ కొత్త స్పిన్నర్ టామ్ హార్ట్ లే
సొంతగడ్డపై టీమిండియా చాన్నాళ్ల తర్వాత టెస్టుల్లో ఓటమిని ఎదుర్కొంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 202 పరుగులకు ఆలౌట్ అయింది. కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్ట్ లే 7 వికెట్లతో టీమిండియా పతనంలో కీలకపాత్ర పోషించాడు. 

చివర్లో బుమ్రా (6 నాటౌట్), సిరాజ్ (12) భారీ షాట్లు కొట్టే ప్రయత్నం చేయడంతో టీమిండియా గెలుపుపై ఆశలు కలిగినా, హార్ట్ లే మళ్లీ బౌలింగ్ కు దిగడంతో ఆ ఆశలు  ఆవిరయ్యాయి. తొలి బంతికే సిరాజ్ స్టంపౌట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ కు తెరపడింది. 

టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 39, కేఎల్ రాహుల్ 22, కేఎస్ భరత్ 28, రవిచంద్రన్ అశ్విన్ 28 పరుగులు చేశారు. 

స్కోరు వివరాలు...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు- 246 ఆలౌట్
టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు- 436 ఆలౌట్
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు- 420 ఆలౌట్
టీమిండియా రెండో ఇన్నింగ్స్ స్కోరు- 202 ఆలౌట్

కాగా, ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ జట్టు 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనుంది. 


More Telugu News