ఎన్నికలు, పొత్తులకు... చిరంజీవికి పద్మ విభూషణ్ ఇవ్వడానికి సంబంధం లేదు: విష్ణు వర్ధన్ రెడ్డి

  • చిరంజీవికి పద్మ విభూషణ్
  • జనసేన, బీజేపీ దోస్తీనే అందుకు కారణమని ప్రచారం
  • మోదీ ఎత్తుగడల్లో ఇదొక భాగమని విశ్లేషణలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించడం తెలిసిందే. ఇటీవల అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు కూడా చిరంజీవి కుటుంబానికి ఆహ్వానం అందింది. 

అయితే, పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ బీజేపీకి మిత్రపక్షంగా ఉండడం వల్లే చిరంజీవికి కేంద్రం విశిష్ట పురస్కారం ప్రకటించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, చిరంజీవిని బీజేపీకి సన్నిహితం చేయాలన్న ప్రధాని మోదీ ఎత్తుగడల్లో ఇదొక భాగమన్న రాజకీయ విశ్లేషణలు కూడా వస్తున్నాయి. 

గతంలో తమిళనాడు ఎన్నికల సమయంలోనే రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారని, ఇప్పుడు ఏపీ ఎన్నికల సమయంలో చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించడం వెనుక కూడా రాజకీయ కోణం ఉందని టాక్ వినిపిస్తోంది. 

ఈ క్రమంలో, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఎన్నికలు, పొత్తులకు... చిరంజీవికి పద్మ విభూషణ్ ఇవ్వడానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ పురస్కారానికి చిరంజీవి అన్ని విధాలా అర్హులు అని పేర్కొన్నారు.


More Telugu News