రోహన్ బోపన్న సంచలన విజయంపై ప్రధాని మోదీ నుంచి ఆనంద్ మహీంద్రా వరకు అందరిదీ ఒకే మాట!

  • ఆస్ట్రేలియన్ ఓపెన్ లో చాంపియన్ గా నిలిచిన రోహన్ బోపన్న
  • మాథ్యూ ఎబ్డెన్ తో కలిసి డబుల్స్ టైటిల్ కైవసం
  • 43 ఏళ్ల వయసులో తొలి గ్రాండ్ స్లామ్ సాధించిన బోపన్న
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ లో టైటిల్ గెలిచిన అతి పెద్ద  వయస్కుడిగా రికార్డు
భారత టెన్నిస్ రంగంలో ఇవాళ సంబరాలు మిన్నంటుతున్నాయి. సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ లో డబుల్స్ విజేతగా నిలవడమే అందుకు కారణం. 43 ఏళ్ల వయసులో ఓ గ్లాండ్ స్లామ్ టోర్నీలో విజేతగా నిలవడం మామూలు విషయం కాదు. మాథ్యూ ఎబ్డెన్ తో కలిసి ఇవాళ ఆ ఘనకార్యాన్ని సాకారం చేసిన రోహన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పురుషుల డబుల్స్ విభాగం టైటిల్ కైవసం చేసుకున్నాడు. 

ఈ నేపథ్యంలో, రోహన్ బోపన్నపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా వరకు అందరిదీ ఒకటే  మాట... ప్రతిభకు వయసు అడ్డంకి కాదు అన్నదే అందరి అభిప్రాయం. 

ప్రతిభకు వయసు అడ్డంకి కాదని మరోసారి నిరూపితమైందని ప్రధాని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. మన శక్తిసామర్థ్యాలను ఎల్లప్పుడూ నిర్వచించేది మన కృషి, పట్టుదల అని వివరించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో విజేతగా నిలిచిన రోహన్ బోపన్నకు అభినందనలు... తన సుదీర్ఘ టెన్నిస్ కెరీర్ లో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు అని ప్రధాని మోదీ కొనియాడారు. 

రోహన్ బోపన్న విజయంతో తనకు మళ్లీ టెన్నిస్ రాకెట్ పట్టాలనిపిస్తోందని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. వయసు కేవలం ఒక నెంబరు మాత్రమేనని నిరూపించినందుకు ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

చాంపియన్ గా నిలవడానికి వయసుతో సంబంధంలేదని నిరూపించావు అంటూ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ స్పందించారు. రోహన్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ జోడీ తమ ఆటతో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది అని కొనియాడారు. 

కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా రోహన్ బోపన్నను అభినందించారు. 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ ను గెలిచిన ఆటగాడిగా రోహన్ బోపన్న నేడు చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో టైటిల్ గెలిచిన అత్యంత పెద్ద వయస్కుడు రోహన్ బోపన్నే.


More Telugu News