భారతీయులున్న నౌకపై హౌతీ రెబెల్స్ దాడి... రక్షణగా వచ్చిన ఐఎన్ఎస్ విశాఖపట్నం

  • గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో కొనసాగుతున్న హౌతీ దాడులు
  • ఎంవీ మార్లిన్ లువాండా అనే నౌకపై క్షిపణి దాడి
  • సముద్రంలోనే నిలిచిపోయిన వాణిజ్య నౌక
  • అత్యవసర సందేశం అందుకుని రంగంలోకి దిగిన ఐఎన్ఎస్ విశాఖపట్నం
గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, 22 మంది భారతీయులు, ఒక బంగ్లాదేశీ వ్యక్తి ఉన్న ఓ నౌకపై హౌతీ రెబెల్స్ భీకర దాడి చేశారు. ఎంవీ మార్లిన్ లువాండా అనే ఈ వాణిజ్య నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు యాంటీ షిప్ మిస్సైల్ ను ప్రయోగించారు. క్షిపణి దాడితో దెబ్బతిన్న వాణిజ్య నౌక సముద్రంలో నిలిచిపోయింది. 

క్రూడాయిల్ ను శుద్ధి చేసే క్రమంలో ఉత్పత్తి అయ్యే నాఫ్తా పదార్థాన్ని ఈ నౌకలో రవాణా చేస్తున్నారు. క్షిపణి దాడి అనంతరం ఈ నౌక నుంచి అత్యవసర సందేశం పంపించారు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లోనే మోహరించి ఉన్న భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌక ఈ సందేశాన్ని అందుకుని వెంటనే రంగంలోకి దిగింది. 

క్షిపణి దాడితో వాణిజ్య నౌకపై అగ్నిప్రమాదం సంభవించగా,  ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకా సిబ్బంది ఆ మంటలను సకాలంలో ఆర్పివేశారు. లేకపోతే, ఆ మంటలు విస్తరించి నౌకలోని నాఫ్తా పదార్థం కారణంగా పెను ప్రమాదం సంభవించి ఉండేది. 

ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌక ప్రధానంగా గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్. గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో ప్రత్యేక కార్యకలాపాల కోసం దీన్ని భారత నేవీ వినియోగిస్తోంది. ఇందులో ఎన్సీబీడీ బృందాన్ని అందుబాటులో ఉంచారు. ఎన్సీబీడీ అంటే న్యూక్లియర్, బయోలాజికల్ అండ్ కెమికల్ డ్యామేజ్ కంట్రోల్ టీమ్. 

కాగా, ఎంవీ మార్లిన్ లువాండా నౌక నుంచి అత్యవసర సందేశాన్ని అందుకున్న వెంటనే ఎన్సీబీడీ టీమ్ ఆ నౌకలోకి ప్రవేశించింది. వెంటనే అగ్నికీలలను అదుపులోకి తీసుకువచ్చింది. నౌకలోని సిబ్బంది అంతే క్షేమంగా ఉన్నారని ప్రకటించింది. వారికి అవసరమైన సాయం అందించింది.


More Telugu News