'సిద్ధం' అని నువ్వు అనడం కాదు... నిన్ను దించడానికి మేం 'సిద్ధం'గా ఉన్నాం: చంద్రబాబు

  • అనంతపురం జిల్లా ఉరవకొండలో రా కదలిరా సభ
  • టీడీపీ-జనసేన కూటమి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్న చంద్రబాబు
  • టీడీపీ-జనసేన గాలి వీస్తోందని వెల్లడి
  • రాష్ట్రానికి పట్టిన శని మరో 74 రోజుల్లో పోతుందని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లా ఉరవకొండలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభకు హాజరయ్యారు. ఉరవకొండ సభకు హాజరైన ప్రజా వెల్లువను చూసి చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. 

ఓటమి ఖాయమని తెలిసే జగన్ మాటల్లో తేడా కనిపిస్తోందని అన్నారు. నిన్నటిదాకా ఒక మాట మాట్లాడిన జగన్... ఇప్పుడు హ్యాపీగా దిగిపోతా అంటున్నాడని వివరించారు. దిగిపోవడం కాదు... దించుతారు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. నువ్వు చేసిన పనులకు, నువ్వు పెట్టిన ఇబ్బందులకు నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజులు దగ్గరపడ్డాయి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని పోయేందుకు ఇంకా 74 రోజులే ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. 

"అందరం కలిసి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పడానికే ఇవాళ ఇక్కడికి వచ్చాను. ఉరవకొండలో టీడీపీ-జనసేన గాలి వీస్తోంది. విశాఖపట్నంలో సిద్ధం మీటింగ్ అంట! సిద్ధం అని నువ్వు అనడం కాదు... నిన్ను దించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఉరవకొండ సభను చూస్తే జగన్ కు నిద్రపట్టదు" అంటూ స్పష్టం చేశారు. 

వైసీపీ పరిపాలనలో నష్టపోని వ్యవస్థ ఒక్కటైనా ఉందా? 

ఈ తుగ్లక్ పాలనలో దెబ్బతినని రంగం ఏదైనా ఉందా? ఈ సైకో పాలనలో నాశనం కాని వ్యవస్థ ఏదైనా ఉందా? ఎక్కడైనా మంచి రోడ్లు ఉన్నాయా? ఎక్కడైనా వ్యవసాయ శాఖ, విద్యాశాఖ కనిపిస్తున్నాయా? పిల్లలకు చదువు చెప్పే పరిస్థితి ఉందా? ఈ ప్రభుత్వ పాలనలో నష్టపోని వ్యక్తి లేడు. 

2019లోనే నేను ఒక మాట చెప్పాను. ఒక్కసారి అని మోసపోతే చాలా నష్టపోతారు... ఆలోచించమని చెప్పాను. మీకు ముద్దులు పెట్టాడు, మిమ్మల్నందరినీ మైమరపింపజేశాడు. మీరు కూడా ఆ మాయలో పడ్డారు. ఈ ప్రభుత్వ పాలనలో తెలుగుజాతి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. 

నీళ్లిస్తే బంగారం పండిస్తారని నేను నమ్మాను

రాయలసీమ రతనాల సీమ! ఇది రాళ్ల సీమ కాదు... రాయలసీమకు నీళ్లిస్తే బంగారం పండించే రైతులు ఉన్నారని నేను నమ్మాను. అందుకే నీళ్లివ్వాలని భావించి ముందుకు వెళ్లాం. అనంతపురం జిల్లాలో వర్షపాతం తక్కువ. ఈ జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లివ్వాలన్నది నా జీవిత లక్ష్యం. ఆ రోజు రూ.4,500 కోట్లు ఖర్చుపెట్టి హంద్రీ-నీవా పరుగులు పెట్టించాం. జీడీ పిల్లి, భైరవానితిప్ప, పేరూరు, గొల్లపల్లి రిజర్వాయర్, గుంతకల్లు బ్రాంచి కెనాల్, మడకశిర బ్రాంచి కెనాల్, మారాల రిజర్వాయర్, చెర్లోపల్లి.. వీటన్నింటినీ ముందుకు పరుగులు తీయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 

అనంతపూర్ జిల్లాకు సమృద్ధిగా నీళ్లు ఉంటే గోదావరి జిల్లాలు కూడా పోటీపడలేవు. ఎందుకంటే... గోదావరి జిల్లాల్లో వరి మాత్రమే పండిస్తారు... కానీ ప్రపంచంలో పండే వాణిజ్య పంటలన్నీ అనంతపురం జిల్లాలో పండిస్తారు. అనంతపురం జిల్లాను అంత గొప్పగా చూడాలన్నది నా కల. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. 



More Telugu News