దేశీయ ఈ-మార్కెట్‌లో నంబర్-1గా ఫ్లిప్‌కార్ట్

  • 48 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకున్న ఫ్లిప్‌కార్ట్
  • అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సంస్థగా ‘మీషో’
  • 13 శాతం మార్కెట్ షేర్‌కే పరిమితమైన అమెజాన్ ఇండియా
  • ఫ్లిప్‌కార్ట్‌లో టాప్ సెల్లర్లుగా మొబైల్స్, వస్త్రాలు
  • ప్రాధాన్యమైన ఈకామర్స్ బ్రాండ్‌గా అమెజాన్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ 48 శాతం మార్కెట్ వాటాతో ఈ రంగంలో దేశంలో అగ్రగామిగా నిలిచింది. ఈ మేరకు అలయన్స్ బెర్న్‌స్టీన్ తాజా నివేదిక పేర్కొంది. అలాగే, దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ కామర్స్ పోర్టల్‌గా ‘మీషో’ నిలిచింది. బెర్న్‌స్టీన్ నివేదిక ప్రకారం వార్షిక ప్రాతిపదికన ఫ్లిప్‌కార్ట్ 21 శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో మీషో యూజర్ బేస్ 32 శాతం పెరిగింది. మరో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వినియోగదారుల వృద్ధి 13 శాతానికి పరిమితమైంది.

ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ (50 శాతం), వస్త్రాలు (30శాతం) అత్యధికంగా అమ్ముడవుతున్న కేటగిరీలో నిలిచాయి. ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో 48 శాతం, ఫ్యాన్ విభాగంలో 60 శాతం వాటాను ఫ్లిప్‌కార్ట్ దక్కించుకుంది. నెలకు సరాసరి 12 కోట్ల యాక్టివ్ యూజర్లతో మీషో వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా నిలిచింది. గత ఏడాది కాలంలో ఈ ప్లాట్‌ఫాంపై ఆర్డర్లు 43 శాతం వృద్ధి సాధించాయి. మళ్లీమళ్లీ షాపింగ్ చేసే వినియోగదారులు 80 శాతం ఉండగా, రెవెన్యూ 54 శాతం పెరిగింది. 

నీల్సన్ మీడియా అధ్యయనంలో మాత్రం అమెజాన్ ఇండియా ఫ్రాధాన్యమైన ఈ-కామర్స్ బ్రాండ్‌గా నిలిచింది. రిలయన్స్‌కు చెందిన అజియో కూడా వినియోగదారులను వేగంగా పెంచుకుంటోంది. యూజర్ల పరంగా 30 శాతం వాటాను కలిగి ఉంది. ఇదే విభాగంలో యాక్టివ్ యూజర్ల పరంగా 50 శాతానికి పైగా మార్కెట్ వాటాతో ఫ్లిప్‌కార్టుకు చెందిన మింత్రా టాప్ ప్లేస్‌లో ఉంది. కిరాణ సరుకుల విక్రయంలో ఈ-గ్రాసరీ ప్లాట్‌ఫాం బ్లింకిట్ 40 శాతం, ఇన్‌స్టామార్ట్ దాదాపు 39 శాతం, జెప్టో 20 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకున్నాయి.


More Telugu News