భక్త రామదాసును చూశారా?.. ఈ విగ్రహం ఆయనదేనట!

  • చెవులకు కుండలాలు, ముకుళిత హస్తాలు..
  • రామదాసు స్వగ్రామమైన నేలకొండపల్లి పోలీస్ స్టేషన్‌లోని రావిచెట్టు వద్ద ఎప్పటి నుంచో విగ్రహం
  • ఆ విగ్రహంలో ఉన్నది కంచర్ల గోపన్నేనని నిర్ధారణ
  • క్షీరాభిషేకం చేసి ప్రత్యేక పూజలు
దేశమంతా రామనామ స్మరణలో మునిగిపోయిన వేళ తెలంగాణలోని ఖమ్మం జిల్లా  నేలకొండపల్లిలో భక్తరామదాసుదిగా చెబుతున్న 16 శతాబ్దంనాటి విగ్రహాన్ని గుర్తించారు. చెవులకు కుండలాలు, ముకుళిత హస్తాలతో ఉన్న ఈ విగ్రహం ఇక్కడి పోలీస్ స్టేషన్‌‌లోని ఓ రావిచెట్టు కింద ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ దానిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇటీవల ఓ వ్యక్తి ఈ విగ్రహాన్ని ఫొటో తీసి ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం సభ్యుడు  రామోజు హరగోపాల్, కట్టా శ్రీనివాస్‌కు పంపాడు.

వెంటనే వారొచ్చి విగ్రహాన్ని పరిశీలించి ఆ విగ్రహం భక్త రామదాసుదేనని నిర్ధారించారు. చక్కని మీసకట్టుతో, అప్పుడే తలారా స్నానం చేసి జుట్టును జారుముడి  వేసుకున్న గోష్పాద శిఖ, అంజలి ముద్ర, నడుము పక్కన కత్తి, కుడిఎడమ భుజాలపై శంఖుచక్ర ముద్రలు ఉన్నాయి. అయితే, ఈ శిల్పంలో రాజోచిత ఆహార్యం లేకపోవడంతో అది అక్కన్నది కానీ, మాదన్నది కానీ అయ్యే అవకాశమే లేదని, వారి మేనల్లుడు కంచర్ల గోపన్నదేనని స్పష్టంగా చెబుతున్నారు. నిన్న ఈ విగ్రహాన్ని రామదాసు ధ్యానమందిరానికి తరలించి రామదాసు పదోతరం వారసుడైన కంచర్ల శ్రీనివాసరావు సమక్షంలో క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.


More Telugu News