చాలా సంతోషంగా ఉంది: సీఎం రేవంత్ రెడ్డిపై జానారెడ్డి ప్రశంసల వర్షం

  • నెల రోజుల పాలన చూస్తోంటే సంతోషంగా ఉందన్న జానారెడ్డి
  • అందరి సలహాలు తీసుకుంటూ ముందుకు సాగాలని సూచన
  • ప్రజాపాలనకు తనవంతు సహకారాన్ని అందిస్తానని హామీ
  • బీఆర్ఎస్ విషయంలో పదేళ్ల క్రితం తాను చెప్పిందే నిజమైందని వ్యాఖ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ నెల రోజుల పాలన చూస్తోంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రజాపాలన ఒరవడితో ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వం ప్రజల మధ్యే ఉందన్న భావన కనిపిస్తోందన్నారు. ఇదే ఒరవడితో ముందుకు సాగుతూ మేధావులు, ప్రజాసంఘాలు, పార్టీ సీనియర్ల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ప్రజాపాలనకు తనవంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం తాను పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయన్నారు. అప్పులు, హామీలు, సంస్కారం, ప్రజాస్వామ్యం, పతకాలపై గత ప్రభుత్వాన్ని.. తాను అనాడే హెచ్చరించానన్నారు. అప్పులు, విద్యుత్ కొనుగోళ్ళు భవిష్యత్‌కు ప్రమాదమని తాను చెప్పిందే ఈ రోజు నిజమైందన్నారు. 

గత పరిస్థితులను వివరిస్తూ, సమస్యలు అధిగమించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోందన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు రాత్రింబవళ్ళు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో తాను నాయకత్వం వహించినప్పటికీ ఇప్పుడు కార్యకర్తగా పార్టీ కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. తన పనితీరు ప్రతీ కార్యకర్తకు ఆదర్శంగా ఉండేలా పని చేస్తానన్నారు. తన అనుభవాన్ని, సలహాలను ప్రభుత్వానికి, ప్రజలకు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధమే అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల్లో గెలిపించడం ద్వారా ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రుణాన్ని తీర్చుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త చేసిన కృషి అద్వితీయమన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి సోనియా గాంధీకి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు.


More Telugu News