ఆ గిన్నెలను కూడా నాకి నాకి సర్ఫ్ అవసరం లేకుండా చేశారు: బీఆర్ఎస్ నాయకులపై జగ్గారెడ్డి

  • తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ రాష్ట్ర బడ్జెట్‌ను నాకించేసిందన్న జగ్గారెడ్డి
  • కోదండరాం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదని వ్యాఖ్య
  • తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్ చేయలేని పనులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెల రోజుల్లో చేసిందన్న జగ్గారెడ్డి
బీఆర్ఎస్ వాళ్లు తొమ్మిదేళ్లలో రాష్ట్ర బడ్జెట్‌ను మొత్తం నాకించేశారు... వండిన గిన్నె మాడిపోయింది.. దానిని కూడా గీకి గీకి పెట్టేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు గిన్నెలను నాకి నాకి సర్ఫ్ అవసరం లేకుండా చేశారని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... 2014లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు రూ.60వేల కోట్లు ఇచ్చిందన్నారు. కానీ తొమ్మిదేళ్లలో కేసీఆర్ చేసిందేమీ లేదని... పైగా రూ.6 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ వాళ్లు బడ్జెట్ మొత్తాన్ని నాకించేశారని తీవ్ర విమర్శలు చేశారు. అన్నం వండిన గిన్నె పూర్తిగా మాడిపోయిందన్నారు. ఆ మాడిన దానిని కూడా బీఆర్ఎస్ వాళ్లు గీకి గీకి పెట్టారని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్దేశించి అన్నారు. తెలంగాణ ఫైనాన్స్‌ను బీఆర్ఎస్ వాళ్లు మాడు లేకుండా నాకించేశారన్నారు.

కోదండరాం గురించి మాట్లాడే అర్హత లేదు

కోదండరాం గురించి కేటీఆర్‌కు మాట్లాడే అర్హత లేదన్నారు. ఉద్యమం కొనసాగుతున్న సమయంలో కోదండరాంను మీరు దేవుడిలా కొలిచారని... కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో కనీసం ఆయనకు కేసీఆర్ అపాయింటుమెంట్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు తాము కోదండరాంకు ఎమ్మెల్సీ ఇస్తే కేటీఆర్ ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కోదండరాంను మీరు అవమానిస్తే... మేం ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించామని కేటీఆర్‌ను ఉద్దేశించి జగ్గారెడ్డి అన్నారు. కోదండరాం పెద్దన్నలా ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తే క్రెడిట్ అంతా కేసీఆర్ కొట్టేశారని ఆరోపించారు. ఉద్యమం ఆయన డైరెక్షన్‌లోనే నడిచిందని... కీలక సమయంలో భీష్ముడి పాత్ర పోషించారన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు ఉద్యమం సమయంలో కోదండ ఇంటికి ఎన్నోసార్లు వెళ్లారని గుర్తు చేశారు.

బట్టలు విప్పి నిలబెట్టే దమ్ముందా?

ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ నాయకుల బట్టలు విప్పి ప్రజల ముందు నిలబెడతామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల బట్టలు విప్పే దమ్ము కేటీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. మేం తొడగొడితే కేటీఆర్ గుండె ఆగుతుందని వ్యాఖ్యానించారు. గత తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్ చేయలేని పనులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెల రోజుల్లో చేసిందన్నారు.


More Telugu News