అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే రెండు సీట్లను ప్రకటించిన పవన్ కల్యాణ్

  • టీడీపీ పొత్తులో ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు తెలుసన్న పవన్
  • రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని వెల్లడి
  • సొంత చెల్లెలిని వదలని జగన్ మనల్ని వదులుతాడా? అని ప్రశ్న
రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్ని సీట్లు తీసుకోవాలో జనసేనాని పవన్ కల్యాణ్ కు కొందరు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసని... అది తెలియకుండానే ఇక్కడ వరకు వచ్చానా? అని ప్రశ్నించారు. 

కొందరు 50 తీసుకోండి, 60 తీసుకోండి అంటున్నారని... పొత్తును ఇబ్బంది పెట్టేలా కొందరు మాట్లాడుతున్నారని పవన్ అన్నారు. ఇది మంచిది కాదని హితవు పలికారు. సీట్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. మనం మూడో వంతు సీట్లను తీసుకోబోతున్నామని చెప్పారు. సీట్ల విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి ఉంటుందని, అలాగే తనపై కూడా ఒత్తిడి ఉందని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో తాను రెండు సీట్లను ప్రకటిస్తున్నానని... రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని అన్నారు. 

సీఎం పదవి కోసం ఎవరూ ఆందోళన చెందొద్దని పవన్ చెప్పారు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు వస్తాయి కానీ, అధికారంలోకి రాలేమని అన్నారు. ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన ఎంతో ఇరుకున పెట్టిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలతో టీడీపీతో పొత్తు ముగియదని, భవిష్యత్తులో కూడా పొత్తు కొనసాగుతుందని తెలిపారు. ఇదే సమయంలో సీఎం జగన్ పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లెలినే వదిలిపెట్టని జగన్... మనల్ని మాత్రం వదులుతాడా? అని ప్రశ్నించారు. జగన్ కు ఊరంతా శత్రువులే అని చెప్పారు. వైసీపీ నేతలకు కష్టాలు వస్తే తన వద్దకే రావాలని అన్నారు. 

సీఎం అభ్యర్థి చంద్రబాబే అని లోకేశ్ మాట్లాడిన మాటలను తాను పట్టించుకోలేదని పవన్ చెప్పారు. చంద్రబాబు సీనియర్ నేత అని, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అని... అందుకే ఇలాంటివి జరుగుతుంటాయని అన్నారు. ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. 2024లో వైసీపీ ప్రభుత్వం రాకూడదని అన్నారు. జగన్ పై తనకు వ్యక్తిగత కక్ష లేదని చెప్పారు.


More Telugu News