బీఆర్ఎస్‌కు కోకాపేటలో 11 ఎకరాల భూమి కేటాయింపుపై పిటిషన్‌.. విచారణకు స్వీకరించిన హైకోర్టు

  • ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ పేరుతో బీఆర్ఎస్‌కు భూకేటాయింపు
  • అత్యంత ఖరీదైన భూమిని తక్కువ ధరకే కేటాయించారని హైకోర్టులో పిటిషన్ దాఖలు
  • ఈ పిటిషన్‌ను ఈ రోజు విచారణకు స్వీకరించిన హైకోర్టు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల భూమిని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కోసం బీఆర్ఎస్ కు కేటాయించడంపై హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అత్యంత ఖరీదైన భూమిని పార్టీ కార్యాలయం కోసం బీఆర్ఎస్ పార్టీకి కేటాయించారని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు చెందిన ప్రభాకర్ పిటిషన్ దాఖలు చేశారు. సర్వే నెంబర్ 239, 240లో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ పేరుతో మార్కెట్ ధర కంటే అతి తక్కువకు 11 ఎకరాల భూమిని కేటాయించినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఎకరా రూ.50 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.3.41 కోట్లకే కేటాయించారని.. ఐదు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తయిందని... దీంతో రాష్ట్ర ఖజానాకు రూ.1,100 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. ఈ కేటాయింపును రద్దు చేసి, ఏసీబీ కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా మాజీ సీఎం కేసీఆర్ పేరును కూడా చేర్చారు. గత ఏడాది జులైలో దాఖలైన ఈ పిటిషన్‌ను హైకోర్టు ఈ రోజు విచారణకు స్వీకరించింది.


More Telugu News