కాంగ్రెస్ రాజ్యమా? పోలీసు రాజ్యమా?: జగిత్యాల జైల్లో ఉన్న సర్పంచ్‌ను కలిసిన తర్వాత కవిత ఆగ్రహం

  • అక్ర‌మ కేసుల‌ను చూస్తూ ఊరుకోమని, పోరాడుతామని హెచ్చరిక
  • రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జీవన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శ
  • కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రావడానికి అమలు చేయలేని హామీలు ఇచ్చారన్న కవిత
ఇది కాంగ్రెస్ రాజ్య‌మా...?  ఖాకీల రాజ్య‌మా...? రాజ‌కీయంగా ఎదుర్కోలేక కేసులు పెట్టారు... కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కక్షపూరితంగా బీఆర్ఎస్ స‌ర్పంచ్‌పై కేసు పెట్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఆరోపించారు. అక్ర‌మ కేసుల‌ను చూస్తూ ఊరుకోం... పోరాడుతామని హెచ్చరించారు. కార్య‌క‌ర్త‌ల‌ను కాపాడుకుంటామని ధైర్యం చెప్పారు. జగిత్యాల సబ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు, హబ్సీపూర్ గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని కవిత పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జీవన్ రెడ్డి కక్షపూరితంగా... రాజేశ్వర్ రెడ్డికి సంబంధం లేని కేసులో ఇరికించారని విమర్శించారు. ముప్పై ఏళ్లలో జీవన్ రెడ్డి హయాంలో జరగనటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ చేసిందన్నారు. తాము చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. తెలంగాణలో పోలీసుల రాజ్యం నడుస్తోందా? కాంగ్రెస్ రాజ్యమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రావడానికి అమలు చేయలేని హామీలు ఇచ్చారన్నారు.

తాము అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ కనిపించిందని తెలిపారు. తాము ఎప్పుడూ పోలీసులను వాడుకోలేదని చెప్పారు. తాము ప్రతి అంశాన్ని రాజకీయంగా ఎదుర్కొన్నాం తప్ప కక్షపూరిత చర్యలకు పాల్పడలేదన్నారు. ఇలాంటి తీరు ఎప్పటికీ నిలబడదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నాలు చేయాలి తప్ప కక్షపూరిత చర్యలు సరికాదని హితవు పలికారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని... ఉద్యమస్ఫూర్తితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.


More Telugu News