భవిష్యత్తు అర్థమయింది.. జగనన్న స్వరం మారింది: గంటా శ్రీనివాసరావు

  • ఓటమి అనివార్యమయిందనే విషయం జగన్ కు అర్థమయిందన్న గంటా
  • మా కుటుంబాన్ని విభజించారంటూ మరో నాటకానికి తెర తీశారని విమర్శ
  • విలువలు లేని నాయకుడిగా జగన్ నిలిచిపోయారన్న గంటా
ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా అంటూ ముఖ్యమంత్రి జగన్ నిన్న చేసిన వ్యాఖ్యలను విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఎక్స్ వేదికగా స్పందిస్తూ... ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న నాయకుడి నోట్లోంచి ఈ మేకపోతు గాంభీర్యం పలుకులు వచ్చాయంటే వారి ఓటమి అనివార్యమని వారికి అర్థమయిందని అన్నారు. 56 నెలలుగా అధికారంలో ఉన్నా... నేను బెటర్‌గానే చేశానని అనుకుంటున్నానని, ఇప్పటికిప్పుడైనా దిగిపోతా అంటూ కొత్త ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే కూల్చడం, విపక్ష నేతలను కేసుల్లో ఇరికించడమే లక్ష్యంగా అడుగులు వేశారు తప్ప... ఏ రోజూ రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగ కల్పన గురించి పాటుపడిందే లేదని విమర్శించారు. 

మా కుటుంబాన్ని విభజించారు అంటూ మరో జగన్నాటకానికి తెర లేపుతున్నది జనాల్లో సింపతీ కోసమా? అని ప్రశ్నించారు. ఏపీ రాజకీయాల్లో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ మీ కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లెలిని, మీ కన్న తల్లిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపిన మీరు... ఈరోజు మా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటుంటే... తనకు "మొసలి కన్నీరు" సామెత గుర్తొస్తోందని చెప్పారు. మీ సొంత బాబాయి హత్య కేసు నిందితుల్ని శిక్షించాలని ఢిల్లీలో కాళ్ళు అరిగేలా తిరుగుతున్న మీ మరో చెల్లెలిని మీ నుంచి ఎవరు విభజించారని ప్రశ్నించారు. 

తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని, పెద్దల్ని గౌరవించలేనివారు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఏమి గౌరవిస్తారనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. విలువ, విశ్వసనీయత లేని రాజకీయ నాయకుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు. రాబోయేది టీడీపీ, జనసేన పార్టీ ప్రభుత్వమనే సందేశం రాష్ట్రమంతా మారుమోగుతోందని అన్నారు. ఇక మీకు మిగిలింది మూడు నెలల సమయమేనని... మీ కేడర్ ను మానసికంగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. మీరు ఊహించినట్టే మీ అరాచక ప్రభుత్వ దమనకాండపై ప్రజలు దండెత్తే సమయం ఆసన్నమైంది జగన్ రెడ్డీ అని అన్నారు. 

"ప్రజా వ్యతిరేకత కనబడింది..... 
భవిష్యత్తు అర్థమైంది.... 
తన ఓటమి తనకి వినబడింది... 
జగనన్న స్వరం మారింది.... 

2021లో నా వెంట్రుక కూడా పీకలేరు...! 
2022లో నన్నే నమ్మండి...! 
2023లో మిమ్మల్నే నమ్ముకున్నా...! 
2024లో హ్యాపీగా దిగిపోతా..! " అంటూ ట్వీట్ చేశారు.


More Telugu News