ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తో కలిసి మోదీ రోడ్ షో

  • రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు
  • కాసేపట్లో జైపూర్ లో ల్యాండ్ అవుతున్న మాక్రాన్
  • జైపూర్ లో జంతర్ మంతర్ నుంచి సంగనేరి గేట్ వరకు మోదీ, మక్రాన్ రోడ్ షో
రేపటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలో సర్వం సిద్ధమయింది. ఈ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఆయన ఫ్రాన్స్ నుంచి నేరుగా రాజస్థాన్ రాజధాని జైపూర్ కు చేరుకుంటారు. ప్రధాని మోదీ కూడా జైపూర్ కు చేరుకుంటున్నారు. ఇరువురు నేతలు జైపూర్ లో షికారు చేయనున్నారు. 

మాక్రాన్ తొలుత నగరంలోని అంబర్ కోటను దర్శిస్తారు. అక్కడ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షిస్తారు. ఆ తర్వాత జైపూర్ లో ఉన్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జంతర్ మంతర్ కు వెళ్తారు. జంతర్ మంతర్ టూర్ లో మాక్రాన్ తో మోదీ కలుస్తారు. అనంతరం ఇద్దరూ కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. వీరి రోడ్ షో కోసం ఒక ప్రత్యేక వాహనాన్ని రెడీ చేశారు. జంతర్ మంతర్ నుంచి సంగనేరి గేట్ వరకు రోడ్ షో కొనసాగుతుంది. మార్గమధ్యంలో ప్రఖ్యాతిగాంచిన హవామహల్ వద్ద వీరు ఆగుతారు. హవా మహల్ వద్ద వీరు జైపూర్ స్పెషల్ మసాలా టీ సేవిస్తారు. మరోవైపు రాంబాగ్ ప్యాలెస్ లో మాక్రాన్ కు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. 

మాక్రాన్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాలు పలు ఒప్పందాలు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఫైటర్ జెట్స్, సబ్ మెరైన్లకు సంబంధించి మల్టీ బిలియన్ డాలర్ల ఒప్పందాలపై చర్చలు జరగనున్నాయి. మరో 26 రాఫెల్ ఫైటర్ జెట్లు, మూడు స్కార్పియన్ సబ్ మెరైన్ల కొనుగోలుపై ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. 

యూరోపియన్ దేశాల్లో ఇండియాకు ఫ్రాన్స్ దశాబ్దాలుగా మంచి మిత్రదేశంగా కొనసాగుతోంది. అంతేకాదు ఇండియాకు ఆయుధాలను సరఫరా చేస్తున్న దేశాల్లో రెండో పెద్ద దేశంగా ఫ్రాన్స్ ఉంది.


More Telugu News