బ్లడ్ క్యాన్సర్ పీడిత చిన్నారికి గంగాస్నానం..బాలుడి దుర్మరణం

  • బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డ 5 ఏళ్ల చిన్నారి, బతకడం కష్టమన్న వైద్యులు
  • గంగాస్నానం చేయిస్తే బతుకుతాడన్న ఆశతో ఢిల్లీ నుంచి హరిద్వార్ వచ్చిన తల్లిదండ్రులు
  • నదిలో చిన్నారికి స్నానం చేయించగా బాలుడి దుర్మరణం
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఐదేళ్ల వయసులోనే ఆ చిన్నారి బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు. అతడు కోలుకోవడం కష్టమని వైద్యులు చెప్పేశారు. కన్నబిడ్డ శాశ్వతంగా దూరమవుతాడని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గంగాస్నానంతో అద్భుతం జరగొచ్చన్న చివరి ఆశతో చిన్నారికి నదీస్నానం చేయించారు. దీంతో, బాలుడు దుర్మరణం చెందాడు. హరిద్వార్‌లో బుధవారం వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలానికి దారి తీసింది. 

ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డ చిన్నారిని తల్లిదండ్రులు కారులో హరిద్వార్‌కు తీసుకొచ్చారు. వారి వెంట మరో బంధువు కూడా వచ్చాడు. ఆ తరువాత బాలుడికి తల్లిదండ్రులు గంగాస్నానం చేయించారు. ఈ క్రమంలోనే చిన్నారి మృతి చెందాడు. బాలుడి మృతదేహాన్ని ఒడిలో పడుకోబెట్టుకుని అతడి తల్లి ఉన్మాదంతో చిన్నారి బతికొస్తాడంటూ అరిచింది. పరిస్థితి తొలి నుంచీ గమనిస్తున్న స్థానికులు చిన్నారి తల్లిదండ్రులపై మండిపడ్డారు. బాలుడి మరణానికి వారే కారణమంటూ నిందించారు. మరోవైపు, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

ఢిల్లీలో బయలుదేరినప్పటి నుంచే బాలుడి ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు కనిపించిందని ఆ కుటుంబం ప్రయాణించిన టాక్సీ డ్రైవర్ తెలిపాడు. హరిద్వార్ చేరుకునే సరికి చిన్నారి పరిస్థితి విషమించిందని వెల్లడించాడు. కుమారుడి ప్రాణాంతక వ్యాధి గురించి, గంగాస్నానం గురించి అతడి తల్లిదండ్రులు చెప్పినట్టు కూడా ట్యాక్సీ డ్రైవర్ వెల్లడించాడు. బాలుడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News