నిక్కీ హేలీకి పెళ్లి ప్రపోజ్ చేసిన ట్రంప్ మద్దతుదారుడు.. దీనికి ఆమె సమాధానం ఇదే!

  • యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ తో పోటీ పడుతున్న నిక్కీ
  • న్యూ హాంప్ షైర్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఊహించని పరిణామం
  • నాకు ఓటు వేస్తావా అని ట్రంప్ మద్దతుదారుడిని ప్రశ్నించిన నిక్కీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీకి ఊహించని పరిణామం ఎదురయింది. న్యూ హాంప్ షైర్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమెకు ట్రంప్ మద్దతుదారు ఒకరు మ్యారేజ్ ప్రపోజ్ చేశాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ జన సమూహంలోంచి గట్టిగా అరిచాడు. దీంతో, అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. 

అయితే, ఒక్క క్షణం షాక్ కు గురైన నిక్కీ... ఆ తర్వాత సరదాగా స్పందించారు. నాకు ఓటు వేస్తావా? అని ఆమె ప్రశ్నించారు. అయితే, తాను ట్రంప్ కే ఓటు వేస్తానని అతడి నుంచి హేళనగా సమాధానం వచ్చింది. దీంతో, అసహనానికి గురైన నిక్కీ... అయితే ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ గట్టిగా అరిచారు. దీంతో, ఆడిటోరియంలో కాసేపు నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత నిక్కీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ కు గట్టి పోటీదారుగా 52 ఏళ్ల నిక్కీ ఉన్నారు. ఇటీవల అయోవా రాష్ట్ర ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ కు 51 శాతం ఓట్లు రాగా... నిక్కీ హేలీకి 19 శాతం ఓట్లు వచ్చాయి. మరో భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామికి 7.7 శాతం ఓట్లు వచ్చాయి. భారతీయులైన ప్రొఫెసర్ అజిత్ సింగ్, రాజ్ కౌర్ రణధావా దంపతులు 1960లో అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. వీరికి 1972లో నిక్కీ జన్మించారు. 1996లో ఆమె మైఖేల్ హేలీని వివాహం చేసుకున్నారు. సౌత్ కరోలినా గవర్నర్ గా నిక్కీ గతంలో రెండు సార్లు పని చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఐక్యరాజ్యసమితిలో ఆమె అమెరికా రాయబారిగా బాధ్యతలను నిర్వహించారు.



More Telugu News