ఏపీలో కుల గణన సీఎం జగన్ కుట్రలో భాగమే!: కాల్వ శ్రీనివాసులు

  • ఏపీలో కుల గణనపై కాల్వ శ్రీనివాసులు స్పందన
  • రాజకీయ లబ్ది కోసమే ఇప్పుడు కులగణన చేపట్టారని విమర్శ  
  • ఇన్నాళ్లు ఎందుకు కులగణన చేపట్టలేదన్న కాల్వ
ఏపీలో బీసీ కులగణన సీఎం జగన్ రాజకీయ కుట్రలో ఓ భాగమని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసమే ఈ కులగణన చేపట్టారని, రాష్ట్రంలో ఉన్న బీసీలు జగన్ ను నమ్మి ఈ కుట్రకు బలికావొద్దని విజ్ఞప్తి చేశారు. 

బీసీల సంక్షేమం కోసం పాటుపడుతున్నానని చెప్పుకునే జగన్... ఇన్నాళ్లు కుల గణన అంశంలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాకుండా ఏంచేస్తున్నాడని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. కుల గణన అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని జగన్ కనీసం తన ఎంపీలకు కూడా చెప్పలేదని మండిపడ్డారు. ఈ అంశంపై ఇన్నాళ్లు ఎక్కడా మాట్లాడకుండా, ఎవరినీ ప్రశ్నించకుండా, ఉన్నట్టుండి కుల గణనను తెరపైకి తీసుకురావడం జగన్ రాజకీయ అవకాశవాదానికి ప్రబల నిదర్శనం అని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు.

 రాష్ట్రంలో 76 మంది బీసీ నేతల మృతికి, తప్పుడు కేసులతో వేలాది మంది బీసీలు జైలుపాలు కావడానికి జగనే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. జగన్ వంటి వ్యక్తి నుంచి బీసీ సంక్షేమం ఎలా సాధ్యమవుతుందని అన్నారు. 

జన గణనతో పాటే కుల గణన కూడా చేయాలని ఇప్పటికే అనేక కమిషన్లు సిఫారసు చేశాయని, కుల గణన చేపట్టాలని చంద్రబాబు 2014లోనే కోరారని, కానీ కేంద్రం స్పందించలేదని కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు. 

కుల గణన ఆలస్యం కావడం... రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల అభివృద్ధికి విఘాతంలా మారిందని వివరించారు.


More Telugu News