రాముడిని ఆయుధంగా చేసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని చూస్తోంది: వీహెచ్

  • అభివృద్ధి లేదు కానీ హిందూ ఓట్లపై బీజేపీ ప్రేమ అని విమర్శ
  • మోదీ ఆలయాలకు వెళ్లవచ్చు కానీ రాహుల్ గాంధీ వెళ్లవద్దా? అని నిలదీత
  • భద్రాచల రాముడికి ఆహ్వానం ఎందుకు ఇవ్వలేదన్న కాంగ్రెస్ నేత
శ్రీరామచంద్రుడిని ఆయుధంగా చేసుకొని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని చూస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అభివృద్ధి లేదు కానీ హిందూ ఓట్లపై బీజేపీకి ప్రేమ అని విమర్శించారు. రాముడు మీ ఒక్కరికే దేవుడా? ప్రధాని నరేంద్ర మోదీ అన్ని దేవాలయాలు తిరగవచ్చు కానీ రాహుల్ గాంధీ గుడికి వెళ్లవద్దా? అని నిలదీశారు. మోదీ పిలిచినప్పుడే మేం గుడికి వెళ్లాలా ఏమిటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడు కేవలం అయోధ్యలోనే ఉన్నాడా?  భద్రాచలంలో లేడా? అని ప్రశ్నించారు.

భద్రాచల రాముడికి ఆహ్వానం ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. రాహుల్ గాంధీకి వస్తోన్న ఆదరణ చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే గుడికి వెళ్లకుండా ఆయనను అడ్డుకున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీని రావణుడు అంటూ అసోం సీఎం హేమంత్ బిశ్వ చేసిన వ్యాఖ్యలను వీహెచ్ ఖండించారు. అసలు ఆయన ముఖ్యమంత్రేనా? వారు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే వారు రాముడిని ఉపయోగించుకుంటున్నారని వీహెచ్ విమర్శించారు.


More Telugu News