అయోధ్య బాల రాముడి పేరు మార్పు.. ఇకపై ఈ పేరుతో పిలుస్తారు!

  • రామ్ లల్లా పేరు బాలక్ రామ్ గా మార్పు
  • ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్ గా పిలుస్తామన్న ట్రస్ట్ పూజారి
  • గర్భగుడిలో కొలువుదీరిన రాముడి వయసు ఐదేళ్లని వెల్లడి
అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడు కొలువుదీరిన సంగతి తెలిసిందే. గర్భగుడిలో నిన్న జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసి యావత్ దేశం పులకించింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అక్కడ కొలువైన బాల రాముడిని ఇప్పటి వరకు రామ్ లల్లా అని పిలిచారు. ఇప్పుడు బాల రాముడి పేరును మార్చారు. 

ఇకపై రామ్ లల్లాను 'బాలక్ రామ్'గా పిలవనున్నట్టు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయంలో కొలువుదీరిన శ్రీరాముడు ఐదేళ్ల పసిబాలుడని... అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించామని చెప్పారు. ఇకపై ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్ గా పిలుస్తామని తెలిపారు. 

మరోవైపు, స్వామికి రోజుకు ఆరుసార్లు హారతిని ఇస్తామని ట్రస్ట్ కు చెందిన ఆచార్య మిథిలేశ్ నందిని తెలిపారు. మంగళ, శ్రింగార, భోగ, ఉతపన్, సంధ్యా, శయన హారతి ఇస్తామని చెప్పారు. పూరి, కూరతో పాటు పాలు, పండ్లు, రబ్ డీ ఖీర్, పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తామని తెలిపారు. 

ఈరోజు నుంచి బాల రాముడి దర్శనానికి సామాన్య ప్రజలను అనుమతించారు. దీంతో, ఆలయం దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతోంది.


More Telugu News