పాకిస్థాన్ లో ఘోరం.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ జెండాను ఎగరేశాడని కొడుకుని హతమార్చిన తండ్రి

  • పెషావర్ శివార్లలో చోటుచేసుకున్న ఘటన
  • కొడుకుపై పిస్టల్ తో కాల్పులు జరిపిన తండ్రి
  • ఇటీవలే ఖతార్ నుంచి తిరిగొచ్చిన కొడుకు
పాకిస్థాన్ లో ఎన్నికలు జరగనున్న తరుణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ జెండాను ఎగరేశాడని కన్న కొడుకుని తండ్రి హతమార్చాడు. ఖైబర్ ఫక్తూంఖ్వా ప్రావిన్స్ లోని పెషావర్ శివార్లలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తమ ఇంటి ఎదురుగా తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ జెండాను ఎగురవేసిన కొడుకుని తండ్రి వారించాడు. తండ్రి మరో పార్టీ మద్దతుదారుడు కావడమే దీనికి కారణం.

ఈ క్రమంలో ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. అయితే, జెండాను తొలగించేందుకు కొడుకు నిరాకరించాడు. ఈ క్రమంలో వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆగ్రహం పట్టలేని తండ్రి తన 31 ఏళ్ల కొడుకుని పిస్టల్ తో కాల్చాడు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. కొడుకుపై కాల్పులు జరిపిన వెంటనే తండ్రి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఖతార్ లో పని చేస్తున్న మృతుడు ఇటీవలే స్వదేశానికి తిరిగొచ్చాడు. ఫిబ్రవరి 8 పాకిస్థాన్ లో ఎన్నికలు జరగనున్నాయి.


More Telugu News