‘రామ్‌లీలా’ నాటక ప్రదర్శన.. హార్ట్‌ఎటాక్‌తో స్టేజిపైనే కుప్పకూలిన హనుమ పాత్రధారి

  • హర్యానాలోని భివానీలో సోమవారం ఘటన 
  • శ్రీరాముడి పాత్రధారికి పాదాభివందనం చేస్తూ కుప్పకూలిన హనుమ పాత్రధారి
  • వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యుల ప్రకటన
సోమవారం యావత్ దేశం శ్రీరాముడి భక్తిపారవశ్యంతో పరవశిస్తున్న తరుణంలో హర్యానాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. భివానీ నగరంలో ‘రామ్‌లీలా’ నాటక ప్రదర్శన సందర్భంగా హనుమ పాత్రధారి హరీశ్ మెహతా స్టేజిపైన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందారు. 

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని భివానీలోని రాజీవ్ చౌక్ వద్ద ‘రాజ్ తిలక్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ‘రామ్‌లీలా’ నాటకాన్ని ప్రదర్శించారు. శ్రీరాముడి పట్టాభిషేకం, కిరీట ధారణ వంటి ఘట్టాలను ప్రదర్శించారు. ఈ క్రమంలో హనుమ వేషధారి హరీశ్ మెహతా శ్రీరాముడి పాత్రధారికి పాదాభివందనం చేస్తూ పాదాలవద్దే కుప్పకూలిపోయారు. ఇది కూడా నాటకంలో భాగమనుకుని ప్రేక్షకులు కొన్ని క్షణాల పాటు మిన్నకుండిపోయారు. కానీ అచేతనంగా మారిపోయిన ఆయనను చూసి ఆ తరువాత ఒక్కసారి షాకైపోయారు. హరీశ్‌ను లేపే ప్రయత్నం చేసినా ఆయనలో చలనం కనిపించలేదు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. 
 
హరీశ్ మెహతా.. రాష్ట్ర విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. గత 25 ఏళ్లుగా ఆయన నాటకాల్లో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు. ఆయన హఠాన్మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.


More Telugu News