హాంకాంగ్ ను అధిగమించి.. ప్రపంచంలోనే నాలుగో అత్యంత విలువైన స్టాక్ మార్కెట్ గా ఎదిగిన భారత్

  • 4.33 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న భారత స్టాక్ మార్కెట్ల కంబైన్డ్ షేర్ల విలువ
  • 4.29 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉన్న హాంకాంగ్ మార్కెట్ క్యాపిటలైజేషన్
  • 50.86 ట్రిలియన్ డాలర్లతో తొలి స్థానంలో అమెరికా 
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ మరో ఘనతను సాధించింది. హాంగ్ కాంగ్ స్టాక్ మార్కెట్ ను వెనక్కి నెట్టి... ప్రపంచంలోనే నాలుగో అత్యంత విలువైన మార్కెట్ గా అవతరించింది. దేశ వృద్ధిరేటు, విధానపరమైన సంస్కరణల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లకు భారత స్టాక్ మార్కెట్ అత్యంత సుస్థిరమైన, నమ్మకమైనదిగా మారింది. 

బ్లూంబర్గ్ డేటా ప్రకారం మన స్టాక్ మార్కెట్లలోని కంబైన్డ్ షేర్ల విలువ 4.33 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. హాంకాంగ్ విలువ 4.29 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఈ క్రమంలో ప్రపంచంలోని బిగ్గెస్ట్ ఈక్విటీ మార్కెట్లలో భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది. గత డిసెంబర్ 5న భారత్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారి 4 ట్రిలియన్ డాలర్లను దాటింది. ఈ 4 ట్రిలియన్ డాలర్లలో సగ భాగం గత నాలుగేళ్లలో పెరగడం గమనార్హం. బలమైన కార్పొరేట్ ప్రాఫిట్లు మన మార్కెట్ల విలువను అమాంతం పెంచుతున్నాయి.  

మరోవైపు, విదేశీ పెట్టుబడులు అమాంతం పెరుగుతుండటంతో... చైనాకు ప్రత్యామ్నాయంగా మన మార్కెట్ కనిపిస్తోంది. కోవిడ్ ఆంక్షలు, కార్పొరేషన్లపై కఠినమైన నిబంధనలు, ప్రాపర్టీ సెక్టార్ లో సంక్షోభం, పలు దేశాలతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చైనా విలువను తగ్గిస్తున్నాయి. ప్రపంచ గ్రోత్ ఇంజిన్ పేరుగాంచిన చైనా ఆకర్షణ క్రమంగా తగ్గుతోంది. 

ప్రపంచ అత్యంత విలువైన స్టాక్ మార్కెట్లలో... 50.86 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో అమెరికా తొలి స్థానంలో ఉంది. 8.44 ట్రిలియన్ డాలర్లతో చైనా, 6.36 ట్రిలియన్ డాలర్లతో జపాన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో స్థానంలో భారత్ నిలిచింది.


More Telugu News