సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజ్!

  • కోస్గి పాలిటెక్నిక్‌ను ఇంజినీరింగ్ కాలేజ్‌గా అప్‌గ్రెడేషన్
  • సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి
  • సీఎస్ఈ, సీఎస్ఈ (ఏఐ, ఎమ్ఎల్), సీఎస్ఈ (డాటా సైన్స్) కోర్సులు
  • మొత్తం 180 సీట్లతో వచ్చే ఏడాది నుంచి తరగతుల ప్రారంభం
  • పాలిటెక్నిక్ కోర్సులు యథాతథం, జేఎన్‌టీయూహెచ్‌కు అనుబంధంగా కార్యకలాపాలు
తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజ్.. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో ఏర్పాటు కానుంది. ఈ దిశగా కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజినీరింగ్ కళాశాలగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కాలేజ్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచి ఇక్కడ తరగతులు ప్రారంభించనున్నారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ కాలేజ్‌లో మొత్తం 180 సీట్లలో బీటెక్ సీఎస్‌ఈ, సీఎస్‌ఈ (ఏఐ అండ్ ఎమ్ఎల్ ), సీఎస్‌ఈ (డాటా సైన్స్) కోర్సులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

రాష్ట్రంలో ప్రస్తుతం ఇంజినీరింగ్ కాలేజీలన్నీ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. కోస్గి కళాశాల మాత్రం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మౌలిక వసతులు, బోధన, బోధనేతన సిబ్బంది నియామకం, వేతనాలు వంటి వ్యవహారాలన్నీ సాంకేతిక శాఖే చూస్తుంది. అయితే, సిలబస్ రూపకల్పన, పరీక్షల నిర్వహణ, సర్టిఫికేట్ల జారీ కోసం కళాశాలలు ఏవైనా విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉండాలి కాబట్టి కోస్గి ఇంజినీరింగ్ కాలేజీ.. జేఎన్‌టీయూకు అనుబంధంగా కొనసాగుతుంది. ఇంజినీరింగ్ కాలేజీగా అప్‌గ్రేడ్ అయినా ప్రస్తుతమున్న పాలిటెక్నిక్ కోర్సులు యథాతథంగా కొనసాగనున్నాయి. 

ఐదు ఎకరాల్లో ఉన్న కోస్గి పాలిటెక్నిక్ కాలేజీని 2014లో ప్రారంభించారు. ఇక్కడ సివిల్, మెకానికల్, ఈసీఈ బ్రాంచీలు (మొత్తం 180 డిప్లోమా సీట్లు) ఉన్నాయి. వీటికి అదనంగా బీటెక్ బ్రాంచీలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం పాలిటెక్నిక్ కోర్సులకు ఉన్న అధ్యాపకులు సరిపోతారని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవలే అక్కడ ఓ హాస్టల్ కూడా అందుబాటులోకి వచ్చింది.


More Telugu News