ఐక్యరాజ్య సమితిలో భారత్ కు శాశ్వత సభ్యత్వంపై ఎలాన్ మస్క్ స్పందన

  • ఆఫ్రికా ఖండం నుంచి ఒక్క దేశానికీ శాశ్వత సభ్యత్వం లేదని గుటెర్రస్ విచారం
  • భారతదేశం సంగతేంటంటూ ట్విట్టర్ లో ప్రశ్నించిన వ్యాపారవేత్త ఐసెన్ బర్గ్ 
  • భారత్ కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం అసంబద్ధమన్న మస్క్  
  • ఐరాస అనుబంధ సంస్థలలో సంస్కరణలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్య 
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం అనుచితమంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన తాజాగా ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితికి, మారిన కాలానికి అనుగుణంగా ఆయా దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ట్వీట్ పై మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత దేశానికి సాధారణ సభ్యత్వం మాత్రమే ఉంది. శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా అడ్డుపడుతోంది. భద్రతా మండలిలో ప్రస్తుతం చైనా, అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా దేశాలు శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఈ దేశాలకు ప్రత్యేకంగా వీటో పవర్ ఉంటుంది. మండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను ఈ ఐదు దేశాలలో ఏ ఒక్క దేశం అభ్యంతరం వ్యక్తం చేసినా సరే ఆ నిర్ణయం వీగిపోతుంది.

అంతకుముందు గుటెర్రస్ ఓ ట్వీట్ చేస్తూ.. భద్రతా మండలిలో ఆఫ్రికా ఖండం నుంచి ఒక్క దేశానికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ ట్వీట్ పై ఇజ్రాయెల్ వెంచర్ క్యాపిటలిస్ట్ మైఖేల్ ఐసెన్ బర్గ్ స్పందిస్తూ.. మరి భారత దేశం సంగతేంటని గుటెర్రస్ ను ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితిని పూర్తిగా రద్దు చేసి, సరికొత్త నాయకత్వంతో, ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా మరో కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని ఐసెన్ బర్గ్ సూచించారు. ఈ చర్చలో ఎలాన్ మస్క్ కూడా తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. భూమి మీద అత్యధిక జనాభా ఉన్న దేశంగా అవతరించిన భారత్ కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం అసంబద్ధమని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలలో సంస్కరణలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని అన్నారు. అయితే, తమకు మాత్రమే ఉన్న అధికారాన్ని వదులుకోవడానికి కొంతమంది ఇష్టపడరని, ఇదే సమస్యలకు కారణమవుతుందని మస్క్ ట్వీట్ చేశారు.


More Telugu News