తొలి రోజు అయోధ్య రామాలయం వద్ద భక్తజన సంద్రం.. కిక్కిరిసిపోయిన ప్రధాన ద్వారం.. వీడియో ఇదిగో

  • పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చిన భక్తజనం
  • వేకువజామున 3 గంటలకే చేరుకున్న కొందరు భక్తులు
  • అక్కడక్కడా చిన్నపాటి తోపులాటలు
  • తొలిరోజు సుమారు 5 లక్షల మంది ఆలయాన్ని సందర్శించవచ్చని అంచనా
ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు అయోధ్య శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చారు. కొంతమంది రామభక్తులు వేకువజామున 3 గంటలకే ఆలయానికి వచ్చేసి, రామ్‌లల్లాను దర్శించుకోవడానికి ఎదురుచూస్తున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వెలుపల భారీ భక్త జనసందోహం నెలకొంది. దర్శనం కోసం భక్తులు నిరీక్షిస్తున్నారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కాగా చిన్నపాటి తోపులాటలు కూడా జరిగినట్టు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా నేడు అయోధ్య రామాలయాన్ని సుమారు 5 లక్షల మంది భక్తులు సందర్శించవచ్చుననే అంచనాలున్నాయి. సాధారణ భక్తులకు నేటి నుంచి (మంగళవారం) దర్శనభాగ్యం కల్పించడంతో పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

కాగా భక్తులు ఉదయం 8 గంటల నుంచి బాల రాముడిని దర్శించుకోవచ్చని ఆలయ పెద్దలు చెబుతున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివుంచుతారని తెలిపారు. ఆలయంలో రెండుసార్లు హారతిని దర్శించుకోవచ్చు. ఉదయం 6.30 గంటలకు, రాత్రి 7.30 గంటల సమయంలో ఈ అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఇక భక్తులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో దర్శనం, హారతి పాస్‌లను పొందవచ్చు.


More Telugu News