కోమటిరెడ్డిని కాంగ్రెస్ వాళ్లే కోవర్టు అని అంటున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

  • కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నామన్న సోయి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శ
  • కాంగ్రెస్ వారికి కోపం ఉంటే తమపై తీర్చుకోవాలని, రాష్ట్రానికి అన్యాయం చేయవద్దని వ్యాఖ్య
  • తెలంగాణలో అప్రకటిత కరెంట్ కోతలు పెరిగాయన్న జగదీశ్ రెడ్డి
కోమటిరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోనే కోవర్టు అని అంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. సోమవారం బీఆర్ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారంలో ఉన్నామన్న సోయి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు అధికారంలో ఉన్నామన్న విషయం మరిచిపోవడం సిగ్గుచేటు అన్నారు. వారి మాట తీరు ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉందన్నారు. అధికారంలోకి వస్తామని నమ్మకం లేక కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చారన్నారు. హామీల అమలును ప్రశ్నిస్తే వారికి అసహనం పెరుగుతోందన్నారు.

కాంగ్రెస్ వారికి బీఆర్ఎస్ నేతలపై కోపం ఉంటే తమపై తీర్చుకోవాలని... కానీ రాష్ట్రానికి నష్టం చేసే పనులు చేయవద్దని హితవు పలికారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకే తెలియదని మండిపడ్డారు. నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులు కట్టవద్దని ఆయన చెప్పిన దానినే కేటీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కేటీఆర్ నిజం మాట్లాడితే కోమటిరెడ్డి చిన్నా పెద్దా లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి కాంగ్రెస్‌లో ఉంటూ... గతంలో బీజేపీ అభ్యర్థిగా ఉన్న తన తమ్ముడికి ఓటు వేయమని చెప్పారని గుర్తు చేశారు. బీఆర్ఎస్‌ను 39 ముక్కలు చేస్తానని అంటున్నారని.. అది ఆయన తాత తరం కూడా కాదన్నారు.

యూరియా కోసం రైతులు క్యూ లైన్లో చెప్పులు పెట్టే పాత రోజులు మళ్లీ వచ్చాయని విమర్శలు గుప్పించారు. రైతుబంధు ఇంకా రాకపోవడంపై అన్నదాతల్లో ఆందోళన నెలకొందన్నారు. అప్రకటిత కరెంటు కోతలు పెరిగి పోయాయని... కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించింది పార్టీలను చీల్చడానికి కాదని చురక అంటించారు. కేసీఆర్ వల్లే సాగర్‌లో నీళ్ల సమస్య వచ్చిందని కోమటిరెడ్డి అంటున్నారని... పాలన చేత కాకుంటే తప్పుకోవాలి కానీ తప్పుడు మాటలు మాట్లాడవద్దన్నారు. నిరసనలకు తాము తొందర పడటం లేదని... ప్రజలే సమస్యల మీద రోడ్ల పైకి వస్తారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News