ఏపీలో ఓటర్ల తుది జాబితా-2024 విడుదల

  • త్వరలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు
  • ఓటరు తుది జాబితాను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఈసీ
  • నియోజకవర్గాల వారీగా ఓటరు జాబితాలు
ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఓటర్ల తుది జాబితా-2024 విడుదల చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓటర్ల తుది జాబితాను ప్రజలకు ప్రదర్శించాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. 

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. జిల్లాల వారీగా ఓటర్ల తుది జాబితాల కోసం ceoandhra.nic.in వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించింది. కాగా, ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం ఫీడీఎఫ్ పైళ్ల రూపంలో అప్ లోడ్ చేసింది.

ఈ ఓటర్ల తుది జాబితాను ఈసీ రాజకీయ పార్టీలకు కూడా అందించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,08,17,256 కాగా... అందులో పురుష ఓటర్ల సంఖ్య 2,00,09,275... మహిళా ఓటర్ల సంఖ్య 2,07,37,065. థర్డ్ జెండర్ ఓట్ల సంఖ్య 3,482 కాగా... సర్వీస్ ఓట్ల సంఖ్య 67,434.

కర్నూలు జిల్లాలో అత్యధికంగా 20,16,396 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 7,61,538 మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మేర ఓటర్ల సంఖ్య పెరిగింది.


More Telugu News