అప్పుడు ఈ ఆలోచన రాలేదా?: కల్వకుంట్ల కవితకు పొన్నం ప్రభాకర్ కౌంటర్

  • అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న కవిత
  • అధికారంలో ఉన్నప్పుడు ఆలోచన రాలేదా? అని ప్రశ్నించిన పొన్నం
  • పూలే తమకు సర్వదా స్మరణీయుడని వ్యాఖ్య
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ డిమాండ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తనదైన శైలిలో స్పందిస్తూ ఆమెకు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కవిత కోరడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన రాలేదా? అని ఎద్దేవా చేశారు. 

పూలే తమకు సర్వదా స్మరణీయుడని పొన్నం ప్రభాకర్ చెప్పారు. అణచివేతకు వ్యతిరేకంగా ఆయన సలిపిన పోరాటం తమకు ఆదర్శమని... అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ కు ప్రజాభవన్ అనే పేరు పెట్టుకున్నామని తెలిపారు. 

బీసీలను వంచించిన మీరా బీసీల గురించి మాట్లాడేదని పొన్నం ప్రశ్నించారు. మీ నియంతృత్వ పాలనకు ఎదురు తిరిగితే జగిత్యాల మున్సిపల్ ఛైర్మన్ ను ఒక బీసీ మహిళ అని కూడా చూడకుండా ఏడిపించింది మీరు కాదా? అని ప్రశ్నించారు. తాను కూడా ఉద్యమకారుడినే అని చెప్పారు. బీఆర్ఎస్ అధ్యక్ష పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బీసీలకు ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ పదవులను బీసీలకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.


More Telugu News