ప్రాణప్రతిష్ఠ సుముహూర్తం 84 సెకండ్లే..!

  • అభిజిత్ ముహుర్తంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ
  • మధ్యాహ్నం 12:29 గంటల నుంచి 12:30 మధ్య కార్యక్రమం
  • ఉదయం 10:25 గంటలకు అయోధ్యకు ప్రధాని మోదీ
సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహానికి మరికాసేపట్లో ప్రాణప్రతిష్ఠ జరగనుంది. వేద పండితులు, సాధువుల ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి దివ్య ముహూర్తం నిర్ణయించారు. ఈ సుముహూర్తం కేవలం 84 సెకండ్ల పాటు మాత్రమే ఉందని పండితులు చెబుతున్నారు. మధ్యాహ్నం 12:29 గంటల 03 సెకండ్ల నుంచి 12:30 గంటల 35 సెకండ్ల వరకు అభిజిత్ ముహుర్తంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి మరికాసేపట్లో అయోధ్యకు చేరుకోనున్నారు. ఉదయం 10:25 గంటలకు ఆయన అయోధ్యకు చేరుకుని వివిధ పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో 150 మంది సాధువులు, మత గురువులు, 50 మంది ఆదివాసీ తెగలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కరసేవకుల కుటుంబ సభ్యులు సహా ఆహ్వానం అందుకున్న 7 వేల మంది అతిథులు అయోధ్య చేరుకున్నారు. కాగా, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయ్యాక అతిథులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఆపై సీఎం యోగి, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ మహంత్ గోపాల్ దాస్ కూడా ప్రసంగిస్తారు.


More Telugu News