అంగన్‌వాడీల ‘చలో విజయవాడ’.. అర్ధరాత్రి నుంచే పోలీసుల ఉక్కుపాదం

  • కోటి సంతకాల ప్రతులను జగన్‌కు ఇచ్చేందుకు విజయవాడకు రావాలని పిలుపు
  • నేడు కొన్ని జిల్లాల నుంచి, రేపు కొన్ని జిల్లాల నుంచి వచ్చేలా ప్రణాళిక
  • ఎక్కడికక్కడ అడ్డుకుని స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు
తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ అంగన్‌వాడీలు చేపట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వారు సేకరించిన కోటి సంతకాల ప్రతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఇచ్చేందుకు తరలిరావాలంటూ అంగన్‌వాడీ ప్రతినిధులు ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చారు. 

విజయనగరం, విశాఖపట్టణం, బాపట్ల, అనకాపల్లి, పల్నాడు, అన్నమయ్య, తిరుపతి, నంద్యాల కార్యకర్తలు సోమవారం విజయవాడ రావాలని పిలుపునిచ్చారు. మిగతా జిల్లాల వారు రేపు విజయవాడ వచ్చేలా ప్లాన్ చేశారు. అయితే, వీరి ప్రణాళికను భగ్నం చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తుండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

విశాఖపట్టణం జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 40 మందిని అరెస్ట్ చేశారు. దీంతో వారంతా స్టేషన్‌లోనే ఆందోళనకు దిగారు. నెల్లూరు జిల్లా నుంచి రెండు బస్సుల్లో బయలుదేరిన అంగన్‌వాడీ కార్యకర్తలను కావలి వద్ద అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు, విజయవాడ ధర్నాచౌక్ వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. ధర్నాచౌక్ వద్దకు గత అర్ధరాత్రి నుంచి చేరుకుంటున్న అంగన్‌వాడీలను అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ తనిఖీలు చేస్తున్న పోలీసులు కనిపించిన కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు.


More Telugu News