వైఎస్ కుమార్తెగా, జగన్ సోదరిగా షర్మిలను అభిమానిస్తాం... కానీ!: సజ్జల

  • ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల
  • సీఎం జగన్, చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు
  • షర్మిల వాడిన భాష, యాస సరికాదన్న సజ్జల
  • చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా షర్మిలను ప్రయోగించారని వెల్లడి
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు పదవీ బాధ్యతలు చేపడుతూ సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబులపై విమర్శనాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా, సీఎం జగన్ సోదరిగా షర్మిలను తాము అభిమానిస్తామని తెలిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసని ప్రశ్నించారు. 

వైఎస్సార్ చనిపోయాక ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు. జగన్ పై నమోదు చేసినవి అక్రమ కేసులని గులాం నబీ ఆజాదే చెప్పారని వెల్లడించారు. వైఎస్సార్ పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. 

తెలంగాణ నుంచి షర్మిల ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఎవరికి ఆయుధంగా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసని సజ్జల పేర్కొన్నారు. ఇదంతా చంద్రబాబు కుట్రలో భాగమేనని, చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రం షర్మిలేనని అన్నారు. షర్మిల మాట్లాడిన భాష, యాస సరికాదని హితవు పలికారు.

 షర్మిల తెలంగాణ నుంచి హఠాత్తుగా ఏపీకి రావడానికి కారణమేంటి? తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి ఎందుకు నిర్ణయం మార్చుకున్నారు? తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా... అక్కడి పార్టీని ఆమె ఎందుకు గుర్తించలేదు? అంటూ సజ్జల ప్రశ్నల వర్షం కురిపించారు. 


More Telugu News